తెనుగుపూడి గురుకులంలో విష జ్వరాల విజృంభణ | - | Sakshi
Sakshi News home page

తెనుగుపూడి గురుకులంలో విష జ్వరాల విజృంభణ

Jul 5 2026 3:06 AM | Updated on Jul 5 2026 3:06 AM

పాఠశాలలు పునః ప్రారంభం తర్వాత 22 మందికి మలేరియా

దేవరాపల్లి: మండలంలోని తెనుగుపూడి డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల విద్యాలయంలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. వేసవి సెలవుల అనంతరం పాఠశాల పునః ప్రారంభం తర్వాత ఇప్పటికి ఏకంగా 22 మంది మలేరియా బారినపడ్డారు. ఈ నెలలో కేవలం మూడు రోజుల వ్యవధిలోనే 13 మంది విద్యార్థులకు మలేరియా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరిలో కొంత మంది విద్యార్థులు స్థానిక పీహెచ్‌సీ వైద్య సిబ్బంది అందిస్తున్న చికిత్సతో కోలుకోగా, ప్రస్తుతం పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక గది(సిక్‌ రూమ్‌)లో ముగ్గురు చికిత్స పొందుతున్నారు. ఈ గదిలో చికిత్స పొందుతున్న విద్యార్థులకు కనీసం సదుపాయాలు కల్పించడంలో స్థానిక ఉపాధ్యాయులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారు. కటిక నేలపై నిద్రిస్తున్న మలేరియా బాధిత విద్యార్థులకు కనీసం వేడి నీరు, ప్రత్యేక పౌష్టికాహారం అందించక పోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విద్యాలయంలో సుమారు 400 మంది విద్యార్థులు చదువుతున్నప్పటికీ అందుకు తగ్గట్టుగా పారిశుధ్య నిర్వహణ లేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. రాత్రీపగలు తేడా లేకుండా దోమలు, ఈగలు స్వైర విహారం చేస్తున్నాయని చెప్పారు. వర్షాలు కురుస్తున్నందున విష జ్వరాలు, అంటు వ్యాదులు ప్రబలే ప్రమాదం ఉన్నందున పారిశుధ్యం మెరుగుపరచాలని వారు కోరారు.

ఇన్‌చార్జ్‌ డీసీవో ఆకస్మిక సందర్శన

ఉమ్మడి విశాఖ జిల్లా గురుకుల విద్యాలయాల ఇన్‌చార్జ్‌ డీసీవో జి.గ్రేస్‌ ఈ పాఠశాలను శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యాబోధనపై ఆరా తీశారు. విద్యార్థులు మలేరియాతో బాధపడుతున్నట్లు తెలుసుకున్న ఆమె సిక్‌ రూమ్‌కు వెళ్లి చికిత్స పొందుతున్న విద్యార్థులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన సేవలందించాలని స్థానిక ఉపాధ్యాయులకు, వైద్య సిబ్బందికి ఆమె సూచించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement