పయినీర్‌ కార్మికుల ఆందోళన | - | Sakshi
Sakshi News home page

పయినీర్‌ కార్మికుల ఆందోళన

Apr 22 2026 7:24 AM | Updated on Apr 22 2026 7:24 AM

● పనికితగ్గ వేతనాలు ఇవ్వలేదని ఆవేదన ● కంపెనీ లోపల విధులు బహిష్కరించిన కార్మికులు

మాకవరపాలెం : పయినీర్‌ రిఫైనరీలో పనికి తగ్గ వేతనాలు ఇవ్వాలంటూ కార్మికులు ఆందోళనకు దిగారు. తమ డిమాండ్లను పరిష్కరించే వరకు ఆందోళనను మరింత ఉధృతం చేసేందుకు సిద్ధమవుతున్నారు. మండలంలోని రాచపల్లి వద్ద 2008లో ఆన్‌రాక్‌ పేరుతో బాక్సయిట్‌ శుద్థి కర్మాగారాన్ని నిర్మించారు. ప్రస్తుతం దీనిని పయినీర్‌ కంపెనీగా పేరుమార్పు చేశారు. ఇందులో వేల సంఖ్యలో కార్మికులు వివిధ విభాగాల్లో పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎనిమిది గంటలకు బదులు 12 గంటలపాటు పని చేయించడం, పనికి తగ్గ వేతనాలు చెల్లించకపోవడంతో మంగళవారం ఈ కంపెనీలో నాలుగు సబ్‌ కాంట్రాక్టర్ల దగ్గర పనిచేస్తున్న 400 మందికి పైగా కార్మికులు కంపెనీ లోపల ఆందోళనకు దిగారు. కార్మిక చట్టం ప్రకారం పనిగంటలు తగ్గించడంతో పాటు ప్రతి నెలా సకాలంలో వేతనాలు చెల్లించాలని, గత పదేళ్లుగా పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు పెంచాలనే డిమాండ్‌తో విధులు బహిష్కరించి ఆందోళన చేస్తున్నట్టు కార్మికులు తెలిపారు. గత నాలుగు రోజులుగా తమ డిమాండ్లను యాజమాన్య పెద్దలకు తెలియ జేసేందుకు నిరసనలు తెలిపినా పట్టించుకోలేదన్నారు. అంతేకాకుండా ఇష్టం లేకపోతే మానేయండని బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపిస్తున్నారు. అందుకే ఒకేసారి కార్మికులమంతా మంగళవారం విధులను బహిష్కరించామని స్పష్టం చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించుకునేందుకు బుధవారం నుంచి ఆందోళనను మరింత ఉధృతం చేసేందుకు సిద్ధమవుతున్నామన్నారు. మెయిన్‌గేటు వద్ద ఆందోళనకు సిద్ధం కావడంతో తమను బయటకు రాకుండా అడ్డుకున్నారని కార్మికులు ఆరోపించారు. నైట్‌ షిఫ్ట్‌ పూర్తి చేసుకున్న కార్మికులను సైతం బయటకు పంపకుండా లోపలే ఉంచేశారన్నారు. అలాగే కంపెనీలోపల అనేక ప్రమాదాలు జరుగుతున్నా బయటకు పొక్కనీయకుండా గోప్యంగా ఉంచుతూ కార్మికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నట్టు ఆరోపిస్తున్నారు.

ఇదిలా ఉండగా కార్మికుల ఆందోళన విషయం తెలుసుకున్న బీజేపీ నాయకుడు, పీఏసీఎస్‌ డైరెక్టర్‌ అడిగర్ల రాంబాబు, టీఎన్‌టీయుసీ మండల అధ్యక్షుడు పైల విక్రమ్‌కుమార్‌ పయినీర్‌ కంపెనీ మెయిన్‌ గేటు వద్దకు చేరుకున్నారు. నాణ్యమైన డిమాండ్లను పరిష్కరించాలని ఆందోళన చేస్తున్న కార్మికులను కంపెనీ యాజమాన్యం బెదిరింపులకు దిగడం సరికాదన్నారు. కార్మికులకు తాము మద్దతుగా ఉంటామన్నారు. ఆందోళన విషయమై కంపెనీ ప్రతినిధి ఎల్‌.ఎస్‌.రావును ఫోన్‌లో సంప్రదించగా తమకు ఏమీ చెప్పకుండానే కార్మికులు విధులకు వెళ్లకుండా ఆగిపోయారన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement