ఒత్తిడి | - | Sakshi
Sakshi News home page

ఒత్తిడి

Feb 23 2026 7:14 AM | Updated on Feb 23 2026 7:14 AM

ఒత్తిడి

ఒత్తిడి

● ప్రభుత్వ టార్గెట్లు, అధికారుల వేధింపులతో తీవ్ర మానసిక క్షోభ ● రాష్ట్రవ్యాప్తంగా సచివాలయ శాఖలోనే ఆకస్మిక మరణాలు ● ఏడేళ్లయినా దక్కని పదోన్నతులు.. ● సెలవు దినాల్లోనూ తప్పని డ్యూటీ

పనిభారం..

అవస్థలు

పడుతున్న

సచివాలయ సిబ్బంది

చంద్రబాబు ప్రభుత్వంలో సచివాలయ ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సంబంధం లేని పనులన్నీ వారి నెత్తిన రుద్దుతుండటంతో వారు పనిభారంతో ఇబ్బంది పడుతున్నారు. ఒకవైపు గతంలో వలంటీర్లు చేసిన పనులు, మరో వైపు రోజుకో కొత్త సర్వేతో సిబ్బంది తీవ్ర మానసిక, శారీరక ఒత్తిడికి గురవుతున్నారు.

– సాక్షి, అనకాపల్లి

త ప్రభుత్వ హయాంలో జాబ్‌చార్ట్‌ ప్రకారం ఉద్యోగులు కార్యకలాపాలు నిర్వహించే వారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేకుండా పోయింది. చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టిన కొద్ది రోజుల పాటు సచివాలయ ఉద్యోగులకు ఎలాంటి పనులు అప్పగించలేదు. ఆ తర్వాత నుంచి ఉద్యోగులకు క్షణం తీరిక లేకుండా పనులు అప్పగించి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఏ సర్వే జరిగినా అది సచివాలయ ఉద్యోగులే చేయాలన్న పరిస్థితి నెలకొంది. ఏపీ ఏకీకృత కుటుంబ సర్వే–2025, పీ–4 సర్వే, పేదరిక నిర్మూలన, 100 రోజుల హౌస్‌ హోల్డ్‌ సర్వే, విజన్‌–2047, ఓడీఎఫ్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ పల్స్‌ సర్వే, హౌస్‌ జియో ట్యాగింగ్‌.. ఇలా ప్రతిదీ వారి భుజాలపైనే పడుతోంది. ఉదయం 6 గంటలకే పారిశుధ్య పరిశీలన, పెన్షన్ల పంపిణీకి వెళ్లాల్సి వస్తోంది. వీటితో పాటు ట్యాప్‌ కనెక్షన్లు, బాత్‌రూమ్‌ల ఫొటోలు తీయడం, ఇళ్లకు స్టిక్కర్లు అంటించడం వంటి పనులు అప్పగిస్తున్నారు. వార్డు కార్యదర్శులకై తే సర్వేలతో పాటు ఆస్తి పన్ను వసూళ్ల టార్గెట్లు విధించి, ఉన్నతాధికారులు సమీక్షల పేరుతో తీవ్రంగా వేధిస్తున్నారు. ఓ వైపు సర్వేల ఒత్తిడి, మరో వైపు విధుల నిర్వహణతో సతమతమవుతూనే ఎప్పటికప్పుడు ప్రగతి నివేదికలను అందిస్తున్నా.. చిన్నపాటి కారణాలు చూపిస్తూ, ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌లో అవినీతికి పాల్పడుతున్నారంటూ ఉద్యోగులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేస్తున్నారు.

రాజకీయ విమర్శలు

అధికార కూటమి నేతలు సచివాలయాలను ‘దరిద్రాలయాలు’అని, ఉద్యోగులు ‘ఎందుకూ పనికిరారు’అని దుర్భాషలాడిన సందర్భాలు ఉన్నాయి. కానీ తీరా చూస్తే ప్రభుత్వ ప్రచారాలకు, ప్రతి నెలా సర్వేలకు సచివాలయ ఉద్యోగులను ప్రభుత్వం వాడుకుంటోంది. స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు అని పేర్లు మార్చి, ఉద్యోగుల విధులను మాత్రం అస్తవ్యస్తం చేసింది.

జిల్లాలో 3,824 మంది ఉద్యోగులు

ప్రజలకు ప్రభుత్వ సేవలను, సంక్షేమ పథకాలను చేరువ చేసే ఉద్దేశంతో 2019 గణతంత్ర దినోత్సవం నాడు అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఈ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. 29 ప్రభుత్వ శాఖలకు చెందిన సుమారు 540 రకాల ఈ–సేవలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. జిల్లాలో మొత్తంగా 522 సచివాలయాలు సేవలు అందిస్తున్నాయి. వీటిలో 12 కేటగిరీల్లో 3,824 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

సెలవుల్లేవు.. పదోన్నతుల్లేవు

ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకుని ఏడో ఏట అడుగుపెడుతున్నా సచివాలయ ఉద్యోగులకు నేటికీ ఎలాంటి పదోన్నతులు లేవు. జూనియర్‌ అసిస్టెంట్‌ క్యాడర్‌ ఇవ్వాలన్న డిమాండ్‌ నెరవేరలేదు. కనీసం సెలవు రోజుల్లో కూడా విశ్రాంతి లేకుండా పనులు పురమాయిస్తున్నారు. సాయంత్రం 6.30 దాటిన తర్వాత కూడా జోనల్‌ కమిషనర్లు, తహసీల్దార్లు గంటల తరబడి మీటింగ్‌లు పెడుతుండటంతో మహిళా ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పైగా ఏ ప్రభుత్వ శాఖలో లేని విధంగా వీరికి మాత్రమే బయోమెట్రిక్‌ హాజరును జీతాలతో ముడిపెట్టడం గమనార్హం.

ప్రాణాలు తీస్తున్న పని ఒత్తిడి

రాష్ట్రంలో 75 శాఖలు ఉండగా, అత్యధికంగా సచివాలయ శాఖలోనే ఆకస్మిక మరణాలు సంభవిస్తున్నాయి. టార్గెట్లు చేరుకోలేక, అధికారుల చీవాట్లు పడలేక కొందరు రాజీనామాలు చేస్తుంటే, మరికొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. సచివాలయ ఉద్యోగుల సంఘం ట్విట్టర్‌ క్యాంపెయిన్‌ ప్రకారం.. 2024 సెప్టెంబర్‌ నుంచి ఫిబ్రవరి 10వ తేదీ లోపు ఒత్తిడి తట్టుకోలేక సుమారు 70 మంది ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. పని ఒత్తిడి తగ్గించాలని కోరుతూ ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా సచివాలయ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. ఒక సమయంలో ఒకే పని ఇవ్వాలని, సీనియారిటీ జాబితాలు రూపొందించి ప్రశాంతంగా పనిచేసుకునే వాతావరణం కల్పించాలని వారు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

జిల్లాలో వివరాలు ఇలా..

జిల్లాలో మొత్తం గ్రామ,

వార్డు సచివాలయాల: 522

కావాల్సిన సిబ్బంది : 5,363

ప్రస్తుతం పనిచేస్తున్న

సచివాలయ ఉద్యోగులు: 3,824

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement