వచ్చేనెల 8న నూకాంబిక అమ్మవారి ఆలయ పునఃప్రారంభం
● 5 నుంచి 7వ తేదీ వరకు ప్రత్యేక పూజలు
● కొత్త అమావాస్య జాతరకు ప్రత్యేక ఏర్పాట్లు
అనకాపల్లి: ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు స్థానిక గవరపాలెం నూకాంబిక అమ్మవారి ఆలయ పునఃప్రారంభం, రాజగోపురం ప్రారంభ కార్యక్రమాన్ని వచ్చేనెల 8వ తేదీ ఉదయం 10.58 గంటలకు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వాల్‌పోస్టర్‌ను ఆదివారం ఆలయప్రాంగణంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ ఈ ఉత్సవాల్లో భాగంగా 5 వ తేదీ నుంచి 7వ తేదీ వరకూ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్టు తెలిపారు. అమ్మవారి ఆలయాన్ని రూ.12కోట్లు, రాజగోపురాన్ని రూ.2.5 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించినట్టు చెప్పారు. నూకాంబిక అమ్మవారి ఆలయ నిధులు, భక్తుల ద్వారా వచ్చిన నగదుతో పనులు పూర్తిచేశామన్నారు. టీటీడీ నిధులు రావలసి ఉందని, దీనిపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. లారెన్స్ కంపెనీ సీఎస్‌ఆర్ నిధులు సుమారు రూ.లక్షతో అమ్మవారి రఽథం ఆలయం చుట్టూ తిరిగేందుకు వీలుగా రహదారిని అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పారు. ఆలయం పునఃనిర్మాణపనులు 2022లో ప్రారంభించినట్టు ఆయన తెలిపారు. వచ్చేనెల 5వ తేదీ సాయంత్రం పసిడి కలశాల ఊరేగింపు మహాత్సవం, 6న గణపతిపూజ,అంకురార్పణ, హోమం తదితర కార్యక్రమాలు జరుగుతాయన్నారు. 7న క్షీరాభివాసం, ప్రత్యేక పూజలు, 8న రాజగోపురంపై పసిడికలశ పునః ప్రతిష్టాన తదితర కార్యక్రమాలు నిర్వహించి, భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యం కల్పించనున్నట్టు చెప్పారు. అమ్మవారి ఆలయ పునఃప్రారంభానికి సీఎం చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, హోంమంత్రి వంగలపూడి అనిత, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర, దేవదాయ శాఖ మంత్రి ఆనంరామనారాణయ రెడ్డి, ఉత్తరాంధ్ర నియోజకవర్గాల ఎమ్మెల్యేలు విచ్చేయుచున్నట్లు చెప్పారు.
నేటి నుంచి రథం ఊరేగింపు
ఆలయ పునః ప్రారంభం సందర్భంగా ఈనెల 23 నుంచి మార్చి 4వ తేదీ వరకూ అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని జిల్లాలో అన్ని మండలాల్లో రథంపై ఊరేగించనున్నట్టు చెప్పారు. ప్రస్తుతం ఉన్న అమ్మవారు కొలువై ఉన్న బాలాలయం జీర్ణావస్థకు చేరుకుందని, త్వరలో తొలగించి, అక్కడ భక్తుల కోసం గదులు, వంటలు చేసుకునేందుకు మూడు అంతస్తుల భవనం నిర్మించనున్నట్టు తెలిపారు.
కొత్త అమావాస్యకు ప్రత్యేక ఏర్పాట్లు
ఈ ఏడాది మార్చి 2న కొత్త అమావాస్య పండగ చాటింపు జరుగుతుందని, 17న జాతర, 18న కొత్త అమావాస్య పండగ, 19న ఉగాది వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ సహాయ కమిషనర్ యళ్ల శ్రీధర్, చైర్మన్ పీలా నాగశ్రీను (గొల్లబాబు), కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


