నేటి నుంచి ఇంటర్ పరీక్షలు
● కట్టుదిట్టమైన ఏర్పాట్లు
● జిల్లాలో 34 పరీక్ష కేంద్రాలు
● 26,301 మంది విద్యార్థులు
● పరీక్ష కేంద్రాల వద్ద 144వ సెక్షన్ అమలు
సాక్షి, అనకాపల్లి: జిల్లాలో ఈ నెల 23 (సోమవారం) నుంచి ఇంటర్మీడియెట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జిల్లా వ్యాప్తంగా పరీక్ష కేంద్రాల్లో పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఇంటర్మీడియెట్ అధికారి వినోద్‌బాబు తెలిపారు. ఈ పరీక్షల కోసం జిల్లా వ్యాప్తంగా 34 కేంద్రాలను సిద్ధం చేశామని, ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. జిల్లాలో మొత్తం 26,301 మంది విద్యార్థులు హాజరుకానున్నారని చెప్పారు. వీరిలో ప్రథమ 13,153 సంవత్సరం విద్యార్థులు మంది ఉండగా, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 13,148 మంది పరీక్షలు రాయనున్నారు. విద్యార్థులు అరగంట ముందే కేటాయించిన సీట్లలో కూర్చోవాలని ఆయన సూచించారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత కోసం 34 కేంద్రాల్లోని అన్ని రూంల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని, ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వీటి ద్వారా లైవ్ స్ట్రీమింగ్ ఉంటుందని పేర్కొన్నారు. పరీక్షల పర్యవేక్షణకు 2 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 2 సిట్టింగ్ స్క్వాడ్లను నియమించామన్నారు. 34 సెంటర్లలో 500 మంది ఇన్విజిలేటర్లు, 18 మంది కస్టోడియన్లు, 34 చీఫ్ సూపరింటెండెంట్లు, 38 మంది డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. పరీక్షా కేంద్రాల్లోకి ఇన్విజిలేటర్లు, విద్యార్థులు ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు లేదా ఫోన్లు తీసుకురాకూడదని, కేవలం చీఫ్ సూపరింటెండెంట్లకు మాత్రమే కీప్యాడ్ ఫోన్లకు అనుమతి ఉందని స్పష్టం చేశారు. కేంద్రాల పరిధిలో 144వ సెక్షన్ అమలులో ఉంటుందని, సమీపంలోని జిరాక్స్ కేంద్రాలను మూసివేయాలని ఆదేశించారు. విద్యార్థులకు ఏవైనా సందేహాలు లేదా సమస్యలు తలెత్తితే జిల్లా ఇంటర్ బోర్డు కంట్రోల్ రూమ్ నంబర్ 08924220224ను సంప్రదించాలని కోరారు.
వినోద్‌బాబు
నేటి నుంచి ఇంటర్ పరీక్షలు


