ఉపమాక ఆలయ నిర్వహణపై హోం మంత్రి ఆగ్రహం
నక్కపల్లి: ఉపమాక ఆలయాన్ని అభివృద్ధి చేసి భక్తుల సంఖ్య పెంచేందుకు తాను కృషి చేస్తుంటే అర్చకులు, అధికారులు మధ్య సమన్వయం కొరవడిందని హోం మంత్రి వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆమె ఆలయాన్ని సందర్శించారు. అనంతరం టీటీడీ మంజూరు చేసిన నిధులు, చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, వచ్చే నెలలో జరిగే కల్యాణోత్సవ ఏర్పాట్లపై సమీక్షించారు. అనంతరం అనిత మాట్లాడుతూ ఆలయ ప్రాంగణాలు పరిశుభ్రంగా ఉండటం లేదన్నారు. అర్చకులు, దేవస్థాన సిబ్బంది ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు వ్యవహారిస్తున్నారన్నారు. ఇక్కడ ఏం జరుగుతుందో మంత్రిగా తనకు తెలియడం లేదన్నారు. ఇటీవల స్వామివారి పెండ్లి రాట వేసే కార్యక్రమానికి అధికార పార్టీ నాయకులకు సమాచారం ఇవ్వకపోవడం పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎంత అభివృద్ధి చేసే ప్రయత్నాలు జరుగుతున్నా భక్తుల సంఖ్య మాత్రం పెరగడం లేదన్నారు. దేవస్థాన సిబ్బంది, అర్చకుల వల్లే ఇలా జరుగుతోందన్నారు. ఇది సరికాదన్నారు. ఆలయాన్ని గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు టీటీడీకి దత్తత ఇచ్చామన్నారు. తాజాగా రూ.5.46 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. ఇటువంటి సమయంలో అర్చకులు, అధికారుల వ్యవహార శైలి బాగా లేదన్నారు.
అనిత వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు
ఆలయంలో అనిత వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ జరిగే కార్యక్రమాలు, ఉత్సవాల సమాచారం అంతా టీటీడీ అధికారులే అందజేయాలి. అర్చకులకు ఏ మాత్రం సంబంధం లేదు. ఈ విషయం గమనించకుండా పెండ్లి రాట కార్యక్రమం తమ పార్టీ నాయకులకు సమాచారం ఇవ్వలేదంటూ అర్చకులపై అసహనం వ్యక్తం చేయడంపై భక్తులు విస్తుపోయారు. దీనికి తోడు ప్రధానార్చకుడు ప్రసాద్ వ్యక్తిగత పనిమీద ఆదివారం రాత్రే సెలవు పెట్టారు. ఈ విషయం అధికారులు చెప్పినప్పటికీ తాను దర్శనానికి వస్తున్న విషయం తెలిసి కావాలనే సెలవు పెట్టారని, ఆయన అంటే గౌరవం ఉందంటూ ప్రధానార్చకుడి వ్యవహారశైలిపై మంత్రి చిర్రుబుర్రులాడటాన్ని తప్పు పడుతున్నారు. మంత్రి వస్తే అర్చకులు సెలవు పెట్టకూడదా, వాళ్లకి అత్యవసర పనులు ఉండవా అంటూ ప్రశ్నిస్తున్నారు. కొంతమంది నాయకులు సదరు అర్చకుడిపై మంత్రికి ఫిర్యాదు చేయడం వల్లే ఆమె ఈ విధంగా రెచ్చిపోయారన్న ప్రచారం జరుగుతోంది. సదరు ప్రధానార్చకుడిపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నట్లు భోగట్టా.
ఈ వ్యవహారం చిలికిచిలికి గాలివానలా మారి అర్చకులకు, రాజకీయ నాయకులకు మధ్య పొరపొచ్చాలు వచ్చి ఉపమాక వెంకన్నకు రాజకీయ రంగు అంటుకునే ప్రమాదం ఉందన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఇలాగే టీడీీపీ ఎమ్మెల్యే కాకర నూకరాజు ఆలయ వ్యవహారాల్లో జోక్యం చేసుకుని హోమగుండాలు తొలగిస్తే రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా మారింది. ఉపమాక ఆలయ సంప్రదాయాలు మంటగలిపారంటూ హైందవ సంఘాలు భగ్గుమన్నాయి. అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని భక్తులు మంత్రికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ సున్నిత అంశాన్ని మంత్రి ఏ విధంగా చక్కదిద్దుతారో వేచి చూడాలి.


