అనకాపల్లిలో టీడీపీ వర్సెస్ జనసేన
అనకాపల్లి: అనకాపల్లి నియోజకవర్గంలో టీడీపీ, జనసేన మధ్య వర్గ విభేదాలు బహిర్గతమయ్యాయి. ఆదివారం రేషన్ డిపోల పునః ప్రారంభంలో జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ తీరుతో టీడీపీ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణకు తీవ్ర అవమానం ఎదురైంది. అనకాపల్లి పట్టణం రైల్వే స్టేషన్ రహదారి కోట్నివీధి రేషన్ డిపో–15 పునః ప్రారంభించేందుకు ఉదయం 8 గంటలకే మాజీ ఎమ్మెల్యే పీలా, టీడీపీ నాయకులు చేరుకున్నారు. ఇంతలో జనసేన నాయకులు అక్కడికి చేరుకుని తమ ఎమ్మెల్యే కొణతాల వచ్చే వరకూ రేషన్ దుకాణాన్ని ప్రారంభించ వద్దని అక్కడే ఉన్న ప్రభుత్వ అధికారులకు చెప్పారు. దీంతో పీలా ఉదయం 10 గంటల వరకూ రేషన్ దుకాణం వద్దే కూర్చుని, కొణతాల కోసం నిరీక్షించారు. ఎప్పటికీ ఆయన రాకపోవడంతో సమయం ఆన్నసమైనది, తక్షణమే రేషన్ దుకాణాన్ని ప్రారంభించాలని అధికారులను పీలా కోరారు. ఎమ్మెల్యే వస్తే గానీ ప్రారంభించేది లేదని అధికారులు తెగేసి చెప్పడంతో చేసేది లేక పీలా తన అనుచరులతో గవరపాలెంలోని పార్టీ కార్యాలయానికి వెళ్లిపోయారు. ఆ వెంటనే జనసేన నాయకులు పీలా వెళ్లిపోయిన విషయాన్ని కొణతాలకు ఫోన్‌లో సమాచారం అందజేశారు. సుమారు ఉదయం 11.30 గంటలకు ఎమ్మెల్యే వచ్చి కోట్నివీధి రేషన్ డిపోను ప్రారంభించారు. పీలా వెళ్లిన తరువాత కొణతాల రావడంపై టీడీపీ శ్రేణులు రుసరుసలాడుతూ కనిపించారు. తమను అవమానించడానికే జనసేన నాయకులు ఇలా వ్యవహరిస్తున్నారని, బయటకు చెప్పుకోలేక లోలోపన మదనపడ్డారు. లబ్ధిదారులు కూడా 3 గంటలకు పైగా నిరీక్షించాల్సి రావడంతో నిరాశతో వెనుదిరిగారు.
రేషన్ డిపో ప్రారంభంలో మాజీ ఎమ్మెల్యే పీలాకు తీవ్ర అవమానం
ఎమ్మెల్యే కొణతాల కోసం 2 గంటలకు పైగా నిరీక్షణ
చివరకు పీలా వెళ్లిన తరువాతప్రారంభోత్సవానికి హాజరైన కొణతాల
రుసరుసలాడుతూ వెనుదిరిగిన టీడీపీ శ్రేణులు


