ప్రత్యేక ఉపాధ్యాయుడికి అభినందన
రావికమతం : రాష్ట్ర స్థాయి స్పెషల్ ఒలింపిక్ భారత్–2025 క్రీడా పోటీల్లో అనకాపల్లి జిల్లా నుంచి ఐదుగురు పిల్లలు పాల్గొని, జాతీయ స్థాయి క్రీడా పోటీలకు ఇద్దరు దివ్యాంగ విద్యార్థులు ఎంపికవడంతో ఆ విద్యార్థులకు శిక్షణ అందించిన మేడివాడ హైస్కూల్ ప్రత్యేక ఉపాధ్యాయుడు మహాలక్ష్మినాయుడును కలెక్టర్ విజయ కృష్ణన్ స్పెషల్ ఒలింపిక్ భారత్ కోచ్ సర్టిఫికెట్ అందించి అభినందించారు. మహాలక్ష్మినాయుడును అనకాపల్లి జిల్లా విద్యాశాఖ అధికారులు, సమగ్ర శిక్ష జిల్లా సహిత విద్య సమన్యకర్త,సమగ్ర శిక్ష అధికారులు శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. ఆయనను పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు.
డీజిల్ అక్రమ నిల్వ స్థావరంపై దాడి
అచ్యుతాపురం రూరల్: అక్రమంగా డీజిల్ నిల్వ చేసిన స్థావరంపై దాడి చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ నమ్మి గణేష్ శనివారం తెలిపారు. సమాచారం మేరకు నారపాక కూడలిలో కొరుపోలు సరోజారావుకు చెందిన ఖాళీ స్థలంలో మునగపాక మండలం నాగవరం గ్రామానికి చెందిన అప్పికొండ వెంకటేష్ అద్దెకు తీసుకుని ఏర్పాటు చేసిన రేకుల షెడ్డులో అక్రమంగా నిల్వ చేసిన 396 లీటర్ల డీజిల్ స్వాధీనం చేసుకున్నామన్నారు. డీజిల్ ట్యాంకర్ (ఏపీ39టీఎన్2244) డ్రైవర్‌గా పని చేస్తున్న మరో వ్యక్తి అచ్యుతాపురం మండలం ఆవరాజాం గ్రామానికి చెందిన కంఠంరెడ్డి శ్రీనివాస్ ఆయిల్ తీస్తుండగా గుర్తించామన్నారు. అక్రమంగా డీజిల్ అమ్మినా కొనుగోలు చేసినా చట్టరీత్యా నేరమని, వారికి తెలియజేసి వారిపై కేసు నమోదు చేశామన్నారు.
తాళం వేసిన ఇంట్లో చోరీ
28 తులాలు వెండి, నగదు తస్కరణ
అనకాపల్లి: మండలంలో మామిడిపాలెం గ్రామానికి చెందిన నంబారు వెంకటరమణ గృహంలో గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. 28 తులాల వెండి, రూ.1500 ఎత్తుకుపోయినట్లు రూరల్ పోలీస్‌లకు ఫిర్యాదు అందింది. హెచ్‌సీ కొండయ్య వివరాలు మేరకు... బాధితుడు వెంకటరమణ శనివారం ఉదయం ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లాడు. సాయంత్రం తిరిగివచ్చి చూసేసరికి ఇంటి తాళాలు పగులుగొట్టి బీరువాలోని 28 తులాలు వెండి, రూ.1500 మాయమైనట్లు గుర్తించి పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు హెచ్‌సీ తెలిపారు.


