దేవరాపల్లి: రైవాడ, కోనాం జలాశయాల ఆయకట్టు రైతులు మరోసారి పోరాటానికి సిద్ధం కావాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి.వెంకన్న పిలుపునిచ్చారు. ఈ మేరకు రైవాడ జలాశయాన్ని శుక్రవారం ఆయన సందర్శించి స్థానిక విలేకర్లతో మాట్లాడారు. హైడ్రో పవర్ ప్లాంట్ ఏర్పాటుకు అదాని కన్ను రైవాడ, కోనాం ప్రాజెక్టులపై పడిందన్నారు. రైవాడ, కోనాం జలాశయానికి జీవనదులుగా ఉన్న శారదానది, చల్ల గెడ్డ, బొడ్డేరు ఉండటంతో దట్టమైన అటవీ ప్రాంతాన్ని అదాని ఎంపిక చేసుకున్నారన్నారు. అనంతగిరి మండలం పరిధిలో అదాని హైడ్రో పవర్ ప్లాంట్ ఏర్పాటుతో వేలాది ఎకరాలకు సాగు, తాగు నీరందించే రైవాడ, కోనాం జలాశయాలకు ముప్పు పొంచి ఉందని వెంకన్న ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పవర్ ప్రాజెక్టుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే త్వరితగతిన అనుమతులు ఇచ్చేస్తున్నాయన్నారు. రెండు జలాశయాలు అదాని చేతుల్లోకి వెళ్లిపోయే ప్రమాదముందని, దీంతో గిరిజనులు దుర్భర జీవితాలను గడపాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఆయా జలాశయాల ఆయకట్టు భూములు ఏడారిగా మారడం ఖాయమన్నారు. అదాని కంపెనీ ప్రతినిధులు దేవరాపల్లిలో ఆఫీసుల నిర్మాణం కోసం భూసేకరణ ప్రక్రియ ప్రారంభించారన్నారు. ఇప్పటికై నా రాజకీయాలకు అతీతంగా పోరాటం చేయాలన్నారు.