
అబుల్ కలాం ఆజాద్ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న కలెక్టర్ రవి పట్టాన్‌శెట్టి
తుమ్మపాల (కలెక్టరేట్): విద్యావేత్త, స్వాతంత్య్ర సమరయోధుడు, లౌకికవాది అయిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్ఫూర్తితో దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని కలెక్టర్ రవి పట్టన్‌శెట్టి పిలుపునిచ్చారు. అబుల్ కలాం ఆజాద్ జయంతిని కలెక్టరేట్‌లో శనివారం ఘనంగా నిర్వహించారు. ఆజాద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతరత్న కలాం మనదేశ తొలి విద్యామంత్రిగా పనిచేశారని, ఆయన రూపొందించిన విద్యావిధానం దేశ అభివృద్ధికి ఎంతో తోడ్పడిందని చెప్పారు. సమైక్యతా వాదైన ఆజాద్ దేశ విభజనను తీవ్రంగా వ్యతిరేకించారన్నారు. మత సామరస్యాన్ని అందరూ పాటించాలని ఆయన ఆచరించి చూపించారని చెప్పారు. జిల్లా రెవెన్యూ అధికారి బి.దయానిధి మాట్లాడుతూ కలాం గొప్ప రచయిత, పాత్రికేయుడు, కవి అని చెప్పారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలనాధికారి ఎ. శ్రీనివాసరావు, మైనారిటీ సంక్షేమ శాఖ జిల్లా విస్తరణ అధికారి ఎ.ఎస్. ప్రవీణ తదితరులు పాల్గొన్నారు.