నక్కపల్లి : బల్క్ డ్రగ్‌ఫార్క్, ఆర్సిలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించకపోతే స్టీల్‌ప్లాంట్, పోర్టు నిర్మాణపు పనులు అడ్డుకుంటామని వైఎస్సార్‌సీపీ రాష్ట్రకార్యదర్శి వీసం రామకృష్ణ, పలువురు నిర్వాసితులు అల్టిమేటం ఇచ్చారు. శనివారం వారు నక్కపల్లి తహసీల్దార్ చిన్నికృష్ణను కలిసి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా వీసం రామకృష్ణ తదితరులు మాట్లాడుతూ ఈ రెండు కంపెనీల కోసం భూములు నివాసిత ప్రాంతాలు త్యాగం చేసిన నిర్వాసితులకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో న్యాయం చేయ లేదన్నారు. ఇళ్లు, భూములు కోల్పోయిన నిర్వాసితులకు ఇవ్వాల్సిన ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ ఇంకా పెండింగ్‌లో ఉందన్నారు. నిర్వాసిత కుటుంబాల్లో వివాహాలైన ఆడపిల్లలకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ చెల్లిస్తామని గతంలో హామీ ఇచ్చారని, ఇప్పుడు ప్యాకేజీ చెల్లించకుండా ఇబ్బందులు పెడుతున్నారన్నారు. ఇలా సుమారు 200 మందికిపైగా ఆడపిల్లలకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ ఇవ్వాల్సి ఉందన్నారు. ఒక కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములుంటే ఒకరికి ప్యాకేజీ ఇచ్చి మరొకరికి ఇవ్వలేదన్నారు. కూటమి నాయకులు సిఫార్సు చేసిన వారికి ప్యాకేజీ ఇస్తున్నారన్నారు. భూసేకరణ, డీఫారం పట్టాలకు నష్ట పరిహారం చెల్లింపుల్లో చాలా అక్రమాలు జరిగాయన్నారు. వీటన్నింటిని త్వరలోనే బహిర్గతం చేస్తామన్నారు. తక్షణమే పెండింగ్‌లో ఉన్న నిర్వాసితులందరికి ప్యాకేజీ వర్తింపజేయకపోతే స్టీల్‌ప్లాంట్ పనులు ఆడ్డుకుంటామన్నారు. సమస్యలను తక్షణమే పరిష్కరించాలన్నారు. తహసీల్దార్‌ను కలిసిన వారిలో మండల పార్టీ అధ్యక్షుడు గొర్ల గోవిందరావు, నిర్వాశిత సంఘ నాయకులు గంటా తిరుపతిరావు,తళ్ల భార్గవ్, యలమంచిలి మధు, శంకర సెట్టి చిన్నా ఉన్నారు.
తహసీల్దార్‌కు వైఎస్సార్‌సీపీ నేతల వినతి


