అదృశ్యమైన వ్యాపారి హత్య! | - | Sakshi
Sakshi News home page

అదృశ్యమైన వ్యాపారి హత్య!

Sep 27 2026 1:16 AM | Updated on Sep 27 2026 1:16 AM

● అమలాపురం వద్ద ఘటన

● మృతదేహం కోసం గోదావరిలో గాలింపు

యలమంచిలి రూరల్‌: కొద్ది రోజులుగా అదృశ్యమైన యలమంచిలి పట్టణం పాత స్టేట్‌ బ్యాంకుకు చెందిన కర్రల వ్యాపారి కర్రి వరప్రకాష్‌రావు (50) కోనసీమ జిల్లా అమలాపురంలో హత్యకు గురైనట్టు తెలిసింది. ఈ నెల 16వ తేదీ నుంచి అదృశ్యమైన వ్యాపారి ప్రకాష్‌రావుకు అమలాపురం, గాజువాక ప్రాంతాలకు చెందిన కొందరు వ్యక్తులతో ఆర్థిక లావాదేవీల్లో ఏర్పడిన వివాదం హత్యకు దారితీసినట్టు సమాచారం. ప్రకాష్‌రావు అదృశ్యమైనట్టు ఈ నెల 20న అతని భార్య సత్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు యలమంచిలి పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. సదరు వ్యాపారి మొబైల్‌ కాల్‌ డేటా ఆధారంగా అమలాపురం, యలమంచిలి పట్టణ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. ప్రకాష్‌ చివరిగా మాట్లాడిన ఫోన్‌ నంబర్‌ ఆధారంగా సదరు వ్యక్తి కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు నిందితులు పట్టుబడ్డారని తెలిసింది. వారిని విచారించగా దారుణంగా కొట్టి హత్య చేసినట్టు అంగీకరించారని విశ్వసనీయ సమాచారం. ఈ నెల 18వ తేదీనే వ్యాపారిని నిందితులు హతమార్చినట్టు తెలుస్తోంది. మృతదేహాన్ని అమలాపురం సమీపంలో గోదావరి నదిలో పడేసినట్టు పోలీసుల వద్ద ఒప్పుకున్నారు. నిందితులు చెప్పిన వివరాల ప్రకారం వ్యాపారి మృతదేహం కోసం గోదావరి నదిలో మూడు రోజులుగా గాలింపు చర్యలు చేపట్టారు. నదిలో ప్రవాహ ఉధృతి ఎక్కువగా ఉండడం, హత్య జరిగి వారం రోజులు గడిచిపోవడంతో మృతదేహం ఆచూకీ లభించలేదని సమాచారం. హత్యకు సంబంధించి అమలాపురం శ్రీరాంపురం ప్రాంతానికి చెందిన ఓ దుకాణం యజమానితో పాటు ముమ్మిడివరం మండలం మహిపాల గ్రామానికి చెందిన మరో వ్యక్తిని నిందితులుగా గుర్తించారు. కేసు దర్యాప్తు నిమిత్తం యలమంచిలి పట్టణ ఎస్‌ఐ కె.సావిత్రి, సిబ్బంది మూడు రోజులుగా అమలాపురంలోనే బస చేసి వివరాలు రాబట్టినట్టు తెలిసింది. దీనిపై ఎస్‌ఐని సంప్రదించగా, వ్యాపారి హత్యకు గురికావడం వాస్తవమేనని, ఆదివారం పూర్తి వివరాలు తెలియజేస్తామని శనివారం రాత్రి తెలిపారు. కాగా హతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement