ముంచంగిపుట్టు: మండలంలోని పెదగూడ పంచాయతీ గూడమాలిపుట్టు గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం ఓ కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచింది. పెంకుటిల్లు కూలిపోవడంతో ఇంట్లో నిద్రిస్తున్న గిరిజనుడు పెంకుల కింద చిక్కుకుని ప్రాణాలు కోల్పోయాడు. గూడమాలిపుట్టులో అర్ధరాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి గ్రామానికి చెందిన పూజారి సూర్యనారాయణ (56) నివాసం ఉన్న ఇల్లు ఒక్కసారిగా కూలిపోయింది. ఆ సమయంలో ఇంట్లో ఉన్న సూర్యనారాయణ పెంకుల మధ్య ఇరుక్కుపోయి తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు వెంటనే అతడిని బయటకు తీసి ముంచంగిపుట్టు సీహెచ్‌సీకి తరలించారు. వైద్యులు పరీక్షించగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు నిర్ధారించారు. అందరితో కలిసిమెలిసి ఉండే సూర్యనారాయణ మృతిపై గిరిజనులు, మాజీ సర్పంచ్ బాబూరావు విచారం వ్యక్తం చేశారు. పెద్దదిక్కును కోల్పోయామని, ప్రభుత్వం ఆదుకోవాలని మృతుడి భార్య మోతి, కుమారుడు పిత్‌బాష్ కోరారు. విషయం తెలుసుకున్న ఎంపీడీవో ధర్మారావు గ్రామాన్ని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి ప్రభుత్వం నుంచి సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.


