తుమ్మపాల: పీజీఆర్‌ఎస్‌కు వచ్చే అర్జీదారులకు సోమవారం ఉచిత భోజన ఏర్పాట్లను కలెక్టర్ విజయకృష్ణన్, జేసీ శౌర్యమాన్ పటేల్ పరిశీలించి అర్జీదారులకు స్వయంగా భోజనం వడ్డించారు. రెండు నెలలుగా ప్రతి సోమవారం ఉచిత భోజన కార్యక్రమం జరుగుతున్నప్పటికీ కలెక్టరేట్ అధికారుల ఆదేశాలతో నిర్వాహకులు గత వారం అర్జీదారులు నుంచి ఒక్కో ప్లేట్ భోజనానికి రూ.5 చొప్పున వసూలు చేసిన విషయం విమర్శలకు దారి తీసింది. దీనిపై స్పందించిన కలెక్టర్ అర్జీదారులకు స్వయంగా భోజనం వడ్డించి అధికారుల తీరుపై పరోక్షంగా చురకలు అంటించారు. అన్నా క్యాంటీన్ ద్వారా అందించే ఈ పథకంలో కూడా నగదు వసూలు చేయడంపై సంబంధిత సిబ్బందిని ఆమె హెచ్చరించినట్టు తెలిసింది. కార్యక్రమంలో డీఆర్వో వై.సత్యనారాయణరావు, సూపరింటెండెంట్ విజయకుమార్ పాల్గొన్నారు.


