కె.కోటపాడు: తామర వ్యాధి చికిత్సకు ఎ.కోడూరు గ్రామానికి వచ్చిన వ్యక్తి వైద్యం పొందుతూ మృతిచెందిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. మృతుడి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎ.కోడూరు ఎస్‌ఐ సంతోష్‌కుమార్ తెలిపిన వివరాలివి. మండలంలో ఆనందపురం గ్రామానికి చెందిన దుంగల ఈశ్వరరావు(55) తామర వ్యాధికి చికిత్స పొందేందుకు ఎ.కోడూరులో గల ఆర్‌ఎంపీ వైద్యుడు త్రినాథ్ వద్దకు సోమవారం వచ్చాడు. ఆర్‌ఎంపీ వైద్యుడు త్రినాథ్ ఈశ్వరరావును పరిశీలించి ఇంజక్షన్ చేశాడని, అయితే కొద్ది సేపటికి ఈశ్వరరావు మృతిచెందాడని తెలిపారు. వైద్యుడు ఇచ్చిన ఇంజక్షన్ వల్లే తన తండ్రి ఈశ్వరరావు మృతిచెందినట్టు కుమారుడు అక్కునాయుడు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు ఎస్‌ఐ తెలిపారు. ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు. మృతదేహాన్ని అనకాపల్లి ఎన్‌టీఆర్ ఆసుపత్రికి పోస్టుమార్టంకు తరలించామన్నారు.


