గొలుగొండ: రావణాపల్లి రిజర్వాయర్ అడుగంటడంతో నర్సీపట్నం, గొలుగొండ మండలాల్లో దారు ణ పరిస్థితులు నెలకొన్నాయి. ఆగస్టు రెండో వారంలో వరి నాట్లు పడి పచ్చగా కళకళలాడాల్సిన పొలా లు జీవం కోల్పోయి బీడువారి ఉన్నాయి. రావణాపల్లి నీటి నిల్వ సామర్థ్యం 139 ఎంసీఎఫ్‌టీలకు గాను, ప్రస్తుతం 49 ఎంసీఎఫ్‌టీలు మాత్రమే ఉంది. గొలు గొండ, నర్సీపట్నం మండలాల్లోని 2,600 ఎకరాల భూములకు ఈ జలాశయం ప్రధాన ఆధారం. ప్రతి ఏటా జులై నెలలో సాగు నీరు విడుదల చేసేవారు. ఈ ఏడాది ఆగస్టు పూర్తి కావస్తున్నా నీటి నిల్వలు లేకపోవడంతో వరి సాగు ప్రశ్నార్థకంగా మారింది.
15 సంవత్సరాల తరువాత...
రావణాపల్లి జలాశయం ఎప్పుడూ నిండు కుండలా ఉండేది. జలాశయం గొలుగొండ మండలంలో ఉన్నప్పటికీ అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం తురవాడ గెడ్డ నుంచి జలాశయంలోకి నీరు వచ్చేది. తురవాడ గెడ్డ నిత్యం నీటితో కళకళలాడేది. ఏజెన్సీ ప్రాంతంలో ఏ మాత్రం వర్షం కురిసినా తురవాడ గెడ్డ పొంగి ప్రవహించి, జలాశయంలోకి నీరు చేరుతుంది. ఏజెన్సీ ప్రాంతంలో కూడా వర్షాలు కురవకపోవడంతో జలాశయం అడుగంటింది. 15 సంవత్సరాల తరువాత ఇటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయని రైతులు ఆవేదన చెందుతున్నారు.
మత్స్యకారులకు నష్టం
రావణాపల్లి జలాశయంలో చేపల పెంపకం కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. ప్రతి ఏటా జనవరి నుంచి జులై వరకు ఈ జలాశయంలో మత్స్యకారులు భారీగా చేపలు వేటాడి జీవనోపాధి పొందుతారు. ఈ ఏడాది జలాశయంలో నీరు లేకపోవడంతో ఇటు రైతులకు, ఇటు వందలాది మంది మత్స్యకారులకు ఇబ్బందులు గురవుతున్నారు.


