అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం | - | Sakshi
Sakshi News home page

అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం

Jun 6 2026 12:47 AM | Updated on Jun 6 2026 12:47 AM

ప్రజలను ముంచే ప్రభుత్వం

డుంబ్రిగుడ: కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న నయవంచక పాలనకు రెండేళ్లు నిండాయని, ఇది ప్రజా సంక్షేమాన్ని కోరే మంచి ప్రభుత్వం కాదని, ప్రజలను ముంచే ప్రభుత్వమని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం విమర్శించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. చంద్రబాబు వెన్నుపోటు పాలనకు రెండేళ్లు పూర్తయిన సందర్భంగా, వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం మండల కేంద్రంలోని మూడు రోడ్ల జంక్షన్‌లో నిరసన ర్యాలీ, మానవహారం కార్యక్రమాలు నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షుడు పాంగి పరశురామ్‌ అధ్యక్షతన జరిగిన ఈ నిరసన సభలో ఎమ్మెల్యే మత్స్యలింగం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క మాటను నిలబెట్టుకోకుండా హామీలన్నింటినీ తుంగలో తొక్కిందని మండిపడ్డారు.

యువత, నిరుద్యోగులకు ఘోర అన్యాయం

డీఎస్సీ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన అభ్యర్థులను సైతం రకరకాల సాకులతో ఉద్యోగాలకు అనర్హులుగా ప్రకటించి, నిరుద్యోగుల జీవితాలతో కూటమి ప్రభుత్వం ఆడుకుంటోందని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం, ప్రపంచ బ్యాంకు నుంచి వారం వారం లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెస్తున్న ఈ ప్రభుత్వం, పేద ప్రజలకు మాత్రం గోరంత కూడా సంక్షేమ పథకాలు అందించడం లేదని దుయ్యబట్టారు. గతంలో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఇదే మండలంలో పర్యటించి, అడవితల్లి బాట కార్యక్రమంలో భాగంగా గిరిజన గ్రామాలకు రోడ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారని ఎమ్మెల్యే గుర్తు చేశారు. ఆ మాట చెప్పి ఏడాది కావస్తున్నా, నేటికీ ఒక్క రోడ్డు కూడా పూర్తిగా నిర్మించని దారుణమైన పరిస్థితిని మనం చూస్తున్నామని విమర్శించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎంపీపీ బాకా ఈశ్వరి, జెడ్పీటీసీ చటారి జానకమ్మ, వైస్‌ ఎంపీపీ శెట్టి ఆనందరావు, వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేగం చాణక్య, మహిళా మండల అధ్యక్షురాలు బంగారు శాంతి, ఉమ్మడి జిల్లాల మాజీ ఎస్టీ సెల్‌ అధ్యక్షుడు కమ్మిడి అశోక్‌, నియోజకవర్గ బూత్‌ కమిటీ ఇన్‌చార్జి పాంగి విజయ్‌, పార్టీ ఉపాధ్యక్షుడు రాంప్రసాద్‌, మండల కార్యదర్శులు మఠం శంకర్‌, రామునాయుడు, లీలారాణి, మహిళా నాయకురాలు బబిత, పలువురు ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్‌లు, పార్టీనేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement