సాక్షి, పాడేరు: గ్రామాల్లో తోటి గిరిజనులకు వైద్య సేవలు అందిస్తూ అహర్నిశలూ శ్రమిస్తున్న తమను ఆశా కార్యకర్తలుగా గుర్తించి, వేతనాలు పెంచాలని కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు డిమాండ్ చేశారు. శుక్రవారం వారు స్థానిక ఐటీడీఏ కార్యాలయం ఎదుట భారీ ధర్నా చేపట్టారు. ఈ ఆందోళన కార్యక్రమానికి సీఐటీయూ నాయకులు పూర్తి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి వి.ఉమామహేశ్వరరావు మాట్లా డుతూ.. గత పదేళ్లుగా జిల్లాలో 700 మంది సీహెచ్‌డబ్ల్యూలు తీవ్ర వెట్టిచాకిరికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆశా కార్యకర్తలతో సమానంగా అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్నప్పటికీ, సీహెచ్‌డబ్ల్యూలకు కేవలం రూ.4 వేల అరకొర వేతనం మాత్రమే చెల్లించడం దారుణమైన అన్యాయమని మండిపడ్డారు.
తక్కువ వేతనంతో ఎలా బతకాలి?
ఆశా కార్యకర్తలకు నెలకు రూ.10 వేల వేతనం చెల్లిస్తున్నారని, తమకు కూడా వారితో సమానంగా వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సీహెచ్‌డబ్ల్యూలు ఆందోళనలు చేస్తున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. గిరిజన ఆరోగ్య రక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న వీరి సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తోందని ధ్వజమెత్తారు.
ఉద్యమం ఉధృతం చేస్తాం:
సీహెచ్‌డబ్ల్యూల న్యాయసమ్మతమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని, లేనిపక్షంలో సీఐటీ యూ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఐటీడీఏ అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి సుందర్రావు, ఆశా కార్యకర్తల సంఘ నాయకులు పద్మ, దాసమ్మ, పార్వతి, ఈశ్వరమ్మ, పెద్ద సంఖ్యలో సీహెచ్‌డబ్ల్యూలు పాల్గొన్నారు.


