వినతులు స్వీకరిస్తున్న జేసీ తిరుమణి శ్రీపూజ
సాక్షి,పాడేరు: స్థానిక ఐటీడీఏలో శుక్రవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ పలు గ్రామాల ప్రజల నుంచి 107 వినతులను స్వీకరించారు. తాగునీరు, రహదారులు, ఇతర మౌలిక సదుపాయాలతో పాటు గిరిజనులు తమ వ్యక్తిగత సమస్యలు పరిష్కరించాలని జేసీని కోరారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ పీజీఆర్‌ఎస్‌కు వచ్చిన వినతులను పరిశీలించి ఆయా వినతులను సకాలంలో పరిష్కరించాలని అన్నిశాఖల అధికారులను ఆదేశించారు. ఫిర్యాదులపై మరింత సమాచారం, ఇతర వివరాలు తెలుసుకునేందుకు ప్రజలు 1100 కాల్ సెంటర్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమశాఖ డీడీ పరిమళ, పలుశాఖల అధికారులు పాల్గొన్నారు.


