● రద్దీనే ఆసరాగా దొంగతనాలు
● మహిళలు, వృద్ధులే ప్రధాన లక్ష్యం
● పెరుగుతున్న నగదు, సెల్‌ఫోన్ చోరీలు
● గస్తీ పెంచాలని ప్రయాణికుల విజ్ఞప్తి
అనకాపల్లి టౌన్: పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌లో దొంగలు తమ చేతి వాటాన్ని ప్రదర్శిస్తున్నారు. మహిళలు, వృద్ధులే లక్ష్యంగా చేసుకుని బంగారు ఆభరణాలు, నగదు, సెల్‌ఫోన్లను తస్కరిస్తున్నారు. సాధారణ ప్రయాణికుల వలే కలిసిపోయి బస్సు ఎక్కి, దిగే సందర్భంలో ఈ చోరీలకు పాల్పడుతున్నట్లు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ప్రత్యేకించి ఉదయం, సాయంత్రం రద్దీ వేళల్లో దొంగలు తమ చేతికి పని చెబుతున్నారు. కాంప్లెక్స్ పరిసరాలలో పోలీసులు కనిపించకపోవడంతో వీరి పని సులువవుతోంది. రూరల్ జిల్లాకు ప్రధాన కేంద్రమైన అనకాపల్లికి ఎక్కువగా చోడవరం, మాడుగుల, బుచ్చెయ్యపేట, నర్సీపట్నం, యలమంచిలి, మునగపాక తదితర మండలాల నుంచి రాకపోకలు సాగిస్తుంటారు. వీరిలో ఎక్కువగా పల్లె జనం కావడంతో దొంగలు వీరి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని తమ పనిని సులువుగా కానిచ్చేస్తున్నారు. ఇక్కడ కాంప్లెక్స్‌లో సీసీ కెమెరాలు తగినన్ని లేకపోవడంతో దొంగలు తెలివిగా వస్తువులను అపహరించి తప్పించుకుంటున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత వ్యక్తులనే లక్ష్యంగా చేసుకుని ఈ దొంగతనాలు జరుగుతున్నాయి.
ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే..
● ఈ నెల 3న చోడవరం మండలం జుత్తాడ గ్రామానికి చెందిన ఒక ప్రయాణికురాలు అచ్యుతాపురం మండలం తిమ్మరాజుపేటలో తన తల్లి దగ్గరకు వెళ్లడానికి అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్‌లో రాంబిల్లి బస్సు ఎక్కింది. స్థానిక బైపాస్ దగ్గరకు రాగానే తన బ్యాగ్‌లో నగదు చూడగా, అందులో రూ.80 వేలు మాయమయ్యాయి.
● జనవరిలో ఇదే ఆర్టీసీ కాంప్లెక్స్‌లో బస్సు ఎక్కుతున్న వృద్ధురాలి నుంచి గుర్తుతెలియని వ్యక్తులు తులం బంగారు ఆభరణాలు చోరీ చేశారు.
● గతేడాది డిసెంబర్‌లో ఇదే ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ప్రయాణికురాలి మెడలో నుంచి నాలుగు తులాల బంగారు వస్తువులను కాజేశారు.
పోలీస్ నిఘా ఏర్పాటు చేయాలి
కాంప్లెక్స్‌లో సివిల్ దుస్తులలో పోలీస్ నిఘా ఏర్పాటు చేయాలి. కాంప్లెక్స్‌కు ఎక్కువగా వివిధ గ్రామాల నుంచి ప్రయాణికులు వస్తుంటారు. వారికి అమాయక మాటలు చెప్పి దొంగలు తమ పని కానిచేస్తున్నారు. సీసీ కెమెరాలు ద్వారా నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలి.
– మద్దాల భాను, అనకాపల్లి
సీసీ కెమెరాల ఏర్పాటుకు
ప్రతిపాదనలు
కాంప్లెక్స్‌లో పోలీసు శాఖ ఏర్పాటు చేసిన ఆరు సీసీ కెమెరాలు ఉన్నాయి. ఆర్టీసీ శాఖ ఆధ్వర్యంలో మరో ఐదు ఏర్పాటు చేయడానికి ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించాం. ఇన్‌గేట్, యలమంచిలి, చోడవరం బస్సులు ఎక్కే దగ్గర కూడా తగినన్ని కెమెరాలు ఏర్పాటు చేస్తాం. ప్రయాణికులు అపరిచిత వ్యక్తులతో మాట్లాడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
– వి. ప్రవీణ, జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారి
అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్ చోరులకు అడ్డాగా మారింది. ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రయాణికుల రద్దీనే ఆసరాగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారు. ప్రధానంగా ఆర్టీసీ బస్సులు ఎక్కి దిగే సమయాల్లో సులువుగా తమ పని కానిచ్చేస్తున్నారు. ఇక్కడ పోలీసుల గస్తీ లేకపోవడం, పూర్తిస్థాయిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల చోరులు తప్పించుకుంటున్నారు.


