పాడేరు: గ్రామస్తులతో కలిసి తిరుపతి దైవదర్శనానికి వెళ్లిన ఓ వ్యక్తి అదృశ్యమై, చివరకు పలాసలో రైల్వే ట్రాక్ పక్కన అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించాడు. మృతుడి జేబులో ఉన్న ఆధార్ కార్డు ఆధారంగా లభించిన ప్రాథమిక సమాచారం ప్రకారం.. పాడేరు మండలం వంతాడపల్లి పంచాయతీ కోట్లగరువు గ్రామానికి చెందిన సివేరి బాబురావు (39) అనే గిరిజన యువకుడు ఈ నెల 2న కొంతమంది గ్రామస్తులతో కలిసి తిరుమల తిరుపతి దర్శనానికి వెళ్లాడు. అయితే, దర్శనం అనంతరం ఆయన అక్కడి నుంచి అదృశ్యమయ్యాడు. తిరుగు ప్రయాణంలో బాబురావు కనిపించకపోవడంతో గ్రామస్తులు ఆయన లేకుండానే ఊరికి చేరుకున్నారు. బాబురావు ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అతని కోసం వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే గురువారం పలాస రైల్వే పోలీసుల నుంచి కుటుంబ సభ్యులకు ఫోన్ కాల్ వచ్చింది. సివేరి బాబురావు మృతదేహం పలాస రైల్వే ట్రాక్ పక్కన పడి ఉందని పోలీసులు సమాచారం అందించారు. బాబురావు ప్రయాణిస్తున్న రైలు నుంచి ప్రమాదవశాత్తు జారిపడ్డాడా, లేక రైలు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడా, లేదా ఎవరైనా హత్య చేసి ట్రాక్‌పై పడేశారా అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఈ సంఘటనపై పలాస రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాబురావు మృతితో కోట్లగరువు గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి.
పలాసలో రైల్వేట్రాక్ పక్కన మృతదేహం
గుర్తించిన రైల్వే పోలీసులు
కుటుంబ సభ్యులకు సమాచారం
అనుమానాస్పద స్థితిలో మృతిగాకేసు దర్యాప్తు
కోట్లగరువులో విషాదచాయలు


