గిరిజనాభివృద్ధిలో ఆదర్శం | - | Sakshi
Sakshi News home page

గిరిజనాభివృద్ధిలో ఆదర్శం

Jun 5 2026 12:06 AM | Updated on Jun 5 2026 12:06 AM

పాడేరు ఐటీడీఏకు జాతీయస్థాయిలో ఉత్తమ పురస్కారం

ఢిల్లీలో అందుకున్న పీవో ఆదిత్యవర్మ

పాడేరు: గిరిజన ప్రాంతాల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో పాడేరు ఐటీడీఏకు సరికొత్త జాతీయ అవార్డు వరించింది. రాష్ట్రంలోని అన్ని ఐటీడీఏల కంటే పాడేరు ఐటీడీఏ అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు గాను ఈ జాతీయ స్థాయి ఉత్తమ పురస్కారానికి ఎంపికై ంది. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో నీతి ఆయోగ్‌ చైర్మన్‌ డాక్టర్‌ అశోక్‌కుమార్‌, కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి చేతుల మీదుగా ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, ఏపీవో ఎం. వెంకటేశ్వరరావు గురువారం ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా నీతి ఆయోగ్‌ చైర్మన్‌ మాట్లాడుతూ.. గిరిజనుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్యం, మౌలిక వసతుల కల్పన కోసం పాడేరు ఐటీడీఏ ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు.

సమష్టి కృషికి దక్కిన గౌరవం: పీవో ఆదిత్య వర్మ

పాడేరు ఐటీడీఏకు ఇంతటి ప్రతిష్టాత్మక పురస్కారం లభించడం పట్ల పీవో ఆదిత్య వర్మ హర్షం వ్యక్తం చేశారు. ఐటీడీఏలోని అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సమష్టి కృషి, అంకితాభావానికి దక్కిన గౌరవం ఇది అని ఆయన పేర్కొన్నారు. రానున్న కాలంలోనూ ఉన్నతాధికారుల మార్గదర్శకాలతో గిరిజనాభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తామని, గిరిజన ప్రాంతాల సమగ్రాభివృద్ధికి మరింతగా పాటుపడతామని పీవో స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement