అంబరాన్నంటిన సత్తెమ్మతల్లి పండగ | - | Sakshi
Sakshi News home page

అంబరాన్నంటిన సత్తెమ్మతల్లి పండగ

Jun 1 2026 12:38 AM | Updated on Jun 1 2026 12:38 AM

సింహాచలం: అడవివరం గ్రామ పొలిమేర దేవత సత్తెమ్మ(మరిడమ్మ) పండగ మహోత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. దుష్ట శక్తులు గ్రామంలోకి రాకుండా గ్రామ పొలిమేరలో కాపలా కాచే దేవతగా విరాజిల్లుతున్న సత్తెమ్మకు రెండేళ్లకోసారి నిర్వహించే ఈ పండగను ఈ ఏడాది కూడా అత్యంత ఘనంగా నిర్వహించారు. తన అక్కచెల్లెళ్ల వద్దకు పొలిమేర నుంచి గ్రామంలోకి విచ్చేసిన సత్తెమ్మని మళ్లీ పొలిమేరకు సాగనంపే కార్యక్రమాన్ని గ్రామస్తులు సందడిగా నిర్వహించారు. అధిక సంఖ్యలో తరలివచ్చిన గ్రామస్తులు, మహిళలతో అడవివరం నుంచి శ్రీనివాసనగర్‌ సమీపంలో ఉన్న సత్తెమ్మ ఆలయం వరకు ఉన్న రెండు కిలోమీటర్ల ప్రధాన రహదారి భక్తజన జాతరగా మారింది. మిట్ట మధ్యాహ్నం మండుటెండను సైతం లెక్క చేయకుండా గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అడవివరంలోని గాంధీనగర్‌లో ఉన్న పైడితల్లి అమ్మవారి సతకంపట్టు వద్దకు గ్రామస్తులు, మహిళలు పసుపు కుంకుమలు, చీరలు, అమృత కలశాలతో చేరుకున్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో అమ్మవారి చెక్కబొమ్మను పూజారి వంశీయులు శిరస్సుపై పెట్టుకుని బయలుదేరారు. దుష్ట శక్తులు అమ్మవారిని వెనక్కు నెట్టకుండా కర్రలు, ఈటెలతో వలయాన్ని ఏర్పాటు చేస్తూ గ్రామస్తులు, పసుపు, కుంకుమలు, చీరలను శిరస్సుపై పెట్టుకుని మహిళలు అమ్మవారిని అనుసరించారు. దారిపొడవునా గ్రామస్తులు తమ ఇళ్ల ముందు పసుపు నీళ్లతో సత్తెమ్మ చెక్కబొమ్మకు అభిషేకాలు చేశారు. పాత గోశాల సమీపంలో ఉన్న పొలిమేర వద్దకు రాగానే సత్తెమ్మను మూడు సార్లు ప్రదక్షిణ చేయించారు. అమ్మవారి వెనుకే భక్తులు, మహిళలు ప్రదక్షిణ చేశారు. అక్కడి నుంచి అమ్మవారిని తీసుకెళ్లి గ్రామ పొలిమేరలో ఉన్న ఆలయంలో అధిష్టింపజేశారు. అమ్మవారి పూజారి వంశీయుడు లండ వెంకటరమణ, ఆలయ గౌరవాధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు, అధ్యక్షుడు పి.వెంకటరావు ఏర్పాట్లు చేశారు. కర్రి అప్పలస్వామి చారిటబుల్‌ ట్రస్ట్‌ అధ్యక్షుడు కర్రి అప్పలస్వామి దారిపొడవునా భక్తులకు మంచినీరు, కూల్‌ డ్రింక్స్‌ అందజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement