హోంగార్డుపై దాడి కేసులో నలుగురికి రిమాండ్‌ | - | Sakshi
Sakshi News home page

హోంగార్డుపై దాడి కేసులో నలుగురికి రిమాండ్‌

Jun 1 2026 12:38 AM | Updated on Jun 1 2026 12:38 AM

పరవాడ: లంకెలపాలెం మరిడిమాంబ ఆలయం వద్ద మే 29న రాత్రి గస్తీ విధుల్లో ఉన్న హోంగార్డుపై దాడికి పాల్పడిన నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు పరవాడ సీఐ ఆర్‌.మల్లికార్జునరావు తెలిపారు. రిమాండ్‌కు తరలించిన నిందితుల్లో రాజ్‌సింగ్‌(కాకినాడ), అనిల్‌సింగ్‌(పీఎం పాలెం), సిరసపల్లికి చెందిన రాజ్‌కుమార్‌సింగ్‌, జితేంద్రసింగ్‌లు ఉన్నారు. స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దాడి ఘటన వివరాలను సీఐ వెల్లడించారు. ఆ రోజు రాత్రి 11.45 గంటల సమయంలో పోలీస్‌ స్టేషన్‌లో హోంగార్డుగా పనిచేస్తున్న కె.వెంకటరావు, కానిస్టేబుల్‌ జి.భాస్కరరావు ఇరువురూ కలిసి లంకెలపాలెం మరిడిమాంబ ఆలయం వద్ద పాన్‌షాపుల వద్ద రాత్రి గస్తీలో ఉన్నారు. ఆ సమయంలో నలుగురు వ్యక్తులు ఇన్నోవా కారులో వచ్చి అక్కడ ఆగారు. రోడ్డుపై ఆపిన కారు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తుందన్న ఉద్దేశంతో విధి నిర్వహణలో భాగంగా హోంగార్డు వెంకటరావు కారు ఫోటో తీసి వారిని అక్కడి నుంచి వెళ్లాలని కోరారు. నిందితులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రాజ్‌సింగ్‌ తన కారులో ఉన్న కత్తితో హోంగార్డు వెంకటరావుపై దాడి చేసి తల, చేయిపై నరికాడు. ఈ దాడిలో హోంగార్డు తలకు బలమైన గాయం కావడంతో తీవ్ర రక్తస్రావమైంది. అగనంపూడి ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం నగరంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. హోంగార్డు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దాడికి పాల్పడిన నలుగురిని మే 30న లంకెలపాలెం ఐవోసీ పెట్రోల్‌ బంకు వద్ద అరెస్టు చేసి అనకాపల్లి న్యాయస్థానంలో హాజరుపర్చగా న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్‌ విధించారని సీఐ తెలిపారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసు సిబ్బందిపై దాడులకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement