ఎలక్టోరల్‌ మ్యాపింగ్‌ వంద శాతం పూర్తి కావాలి | - | Sakshi
Sakshi News home page

ఎలక్టోరల్‌ మ్యాపింగ్‌ వంద శాతం పూర్తి కావాలి

May 31 2026 12:48 AM | Updated on May 31 2026 12:48 AM

సాక్షి,పాడేరు: జిల్లాలోని అన్ని పోలింగ్‌ బూత్‌ల పరిధిలో ఎలక్టోరల్‌ మ్యాపింగ్‌ను వంద శాతం విజయవంతం చేయాలని, విధుల్లో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్‌ టి.నిశాంతి హెచ్చరించారు. శనివారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో బూత్‌ స్థాయి అధికారులకు (బీఎల్‌వో) పలు సామగ్రితో కూడిన ఎలక్టోరల్‌ మ్యాపింగ్‌ కిట్లను కలెక్టర్‌ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మ్యాపింగ్‌ ప్రక్రియలో ఇప్పటికే అలసత్వం వహించిన పాడేరు, అరకులోయ నియోజకవర్గాల పరిధిలోని పలువురు బీఎల్‌వోలకు ఆయా నియోజకవర్గాల ఎన్నికల అధికారులైన జాయింట్‌ కలెక్టర్‌, సబ్‌ కలెక్టర్‌ షోకాజ్‌ నోటీసులు జారీ చేశారని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఉత్తర్వుల మేరకు జిల్లాలోని మొత్తం 1,023 మంది బీఎల్‌వోలకు సరిపడా కిట్లు చేరాయని కలెక్టర్‌ వివరించారు. నిర్దేశిత గడువులోగా మ్యాపింగ్‌ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి డీఆర్‌వో లోకేశ్వరరావుతో పాటు ఇతర రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

7నుంచి 21వరకు యోగా ఉత్సవాలు

జిల్లాలో అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని కలెక్టర్‌ టి.నిశాంతి ఆదేశించారు. ఇందుకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లపై శనివారం కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జూన్‌ 7 నుంచి జూన్‌ 21 వరకు యోగా ఉత్సవాలను జిల్లా వ్యాప్తంగా గ్రామ, మండల స్థాయిలో నిర్వహించాలన్నారు. జూన్‌ 7న కొత్తపల్లి జలపాతం, జూన్‌ 8న మత్స్యగుండంలో యోగా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా నోడల్‌ అధికారిగా ఆయూష్‌శాఖకు చెందిన డాక్టర్‌ మౌనికశ్రీ వ్యవహరిస్తారన్నారు. ఈ సమావేశంలో ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, ఇన్‌చార్జి డీఆర్‌వో లోకేశ్వరరావు, డీఈవో రామకృష్ణారావు, గిరిజన సంక్షేమ డీడీ పరిమళ, గురుకుల ఓఎస్‌డీ మూర్తి, సమాచారశాఖ ఇన్‌చార్జి డీపీఆర్‌వో కె.వెంకటరావు పాల్గొన్నారు.

కలెక్టర్‌ నిశాంతి

Advertisement
 
Advertisement
Advertisement