ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు ప్రోత్సాహం | - | Sakshi
Sakshi News home page

ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు ప్రోత్సాహం

May 31 2026 12:48 AM | Updated on May 31 2026 12:48 AM

పాడేరు: ఏజెన్సీ గిరిజన యువతలో దాగి ఉన్న అపారమైన ప్రతిభను వెలికితీసి, వారిని ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు పోలీసు శాఖ నిరంతరం ప్రోత్సాహం అందిస్తుందని ఎస్పీ అమిత్‌ బర్దర్‌ తెలిపారు. జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో, సార్ధ మెటల్స్‌ అండ్‌ అలయ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సహకారంతో పాడేరు తలార్‌సింగి గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో నెల రోజులుగా నిర్వహించిన వేసవి క్రికెట్‌ శిక్షణ శిబిరం శనివారంతో ముగిసింది. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్పీ మాట్లాడుతూ.. గిరిజన యువత చెడు మార్గాల వైపు వెళ్లకుండా, వారిలోని క్రీడా నైపుణ్యాలను పెంపొందించేందుకు 120 మందికి ఉచితంగా ఈ శిక్షణ ఇచ్చామన్నారు. ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ ద్వారా ముగ్గురు నిష్ణాతులైన కోచ్‌లతో మెలకువలు నేర్పించామని తెలిపారు.యువత చెడు వ్యసనాలకు, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉంటూ చదువుతో పాటు క్రీడలపై దృష్టి సారించాలని ఎస్పీ హితవు పలికారు. క్రీడలు శారీరక, మానసిక ఆరోగ్యానికే కాకుండా నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవడానికి తోడ్పడతాయన్నారు. ఇకపై ప్రతి ఏటా క్రికెట్‌తో పాటు ఇతర క్రీడల్లోనూ పోలీసు శాఖ ద్వారా ఉచిత శిక్షణ ఇస్తామని హామీ ఇచ్చారు. అనంతరం శిక్షణ పూర్తి చేసుకున్న యువతకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. అలాగే, క్రికెట్‌ కోచ్‌లను దుశ్శాలువాలతో సత్కరించి మెమోంటోలు బహూకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ అమిత్‌ బర్దర్‌ను ఎస్బీ ఇన్‌స్పెక్టర్‌ సయ్యద్‌ ఎలియాస్‌ మహమ్మద్‌, పాడేరు సీఐ డి.దీనబంధు, ఎస్‌ఐ పాపినాయుడు, జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ కార్యదర్శి కె.దుర్గారావు తదితరులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు, తల్లిదండ్రులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

ఎస్పీ అమిత్‌ బర్దర్‌ పిలుపు

Advertisement
 
Advertisement
Advertisement