పాడేరు రూరల్: భూగర్భ జలాలు, బావుల ఏర్పాటు, వాటి పర్యవేక్షణపై మరింత నైపుణ్యం పెంచేందుకు శనివారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం, మండల పరిషత్ కార్యాలయాల్లో క్షేత్రస్థాయి నైపుణ్య శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ మండలాల నుంచి సుమారు 25 మంది ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా భూగర్భ జలవనరులశాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనవాసరావు మాట్లాడుతూ.. జిల్లాలో భూగర్భ జలాల బలోపేతంతో పాటు, నీటిమట్టాలను నిరంతరం పర్యవేక్షించేందుకు ఈ నైపుణ్య శిక్షణ తరగతులు ఎంతో దోహదపడతాయన్నారు. ప్రజలకు అన్ని రకాల నాణ్యమైన సేవలను అందించడమే లక్ష్యంగా సాంకేతిక మెలుకువలపై ఈ ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ శిక్షణలో భాగంగా పీజోమీటర్ పరికరం ద్వారా భూగర్భ జలాల ఒత్తిడిని, కచ్చితమైన నీటి నిల్వలను ఏ విధంగా కొలవాలి, ఎలా పర్యవేక్షించాలనే అంశాలపై సిబ్బందికి ప్రత్యక్షంగా డెమో ద్వారా అవగాహన కల్పించారు. క్షేత్రస్థాయిలో బావుల ఏర్పాటుకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. శిక్షణ తరగతులకు హాజరైన ప్రతి ఒక్కరూ ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుని విధుల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆయన కోరారు. సాంకేతిక సిబ్బంది, కార్యాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.
జలవనరులశాఖ డిప్యూటీ డైరెక్టర్
శ్రీనివాసరావు


