పరిమళించిన మానవత్వం | - | Sakshi
Sakshi News home page

పరిమళించిన మానవత్వం

May 31 2026 12:48 AM | Updated on May 31 2026 12:48 AM

● ఆటో ప్రమాద బాధితుడికి రూ.18.40 లక్షల సాయం

మాకవరపాలెం: మానవత్వం పరిమళించింది. సామాజిక మాధ్యమంలో వచ్చిన చిన్న వీడియో సందేశం మానవతా మూర్తుల హృదయాలను కదలించింది. రోడ్డు ప్రమాదంలో గాయపడి జీవచ్ఛమైన ఆటో డ్రైవరుకు ఆపన్నహస్తం అందించేలా చేసింది. రెండు వారాల్లోనే రూ.18.40 లక్షల సాయమందించి అతని కన్నీటి చెమ్మను తుడిచింది.

మండలంలోని రాచపల్లి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్‌ పట్నాల శ్రీను ప్రమాదంలో గాయపడి రెండేళ్లుగా మంచానికి పరిమితమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శెట్టిపాలెం గ్రామానికి చెందిన లాలం ఏసుబాబు స్థాపించిన సాయానికి 10 రూపాయలు సేవా సంస్థ ఆధ్వర్యంలో శ్రీను కుటుంబం దీనస్థితిపై సామాజిక మాధ్యమాల్లో వీడియో విడుదల చేశారు. భార్య, ముగ్గురు పిల్లలతో ఇబ్బందులు పడుతుండడంపై స్పందించిన దాతలు విరివిగా విరాళాలుగా అందించేందుకు ముందుకు వచ్చారు. ఇలా రెండు వారాల్లో విరాళాలుగా వచ్చిన రూ.18 లక్షల 40 వేలను శనివారం సంస్థ సభ్యులు శ్రీను కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకుడు ఏసుబాబు మాట్లాడుతూ 2019 నుంచి ఇప్పటివరకు ఏడుగురు బాధితులకు రూ.కోటి ఆర్థిక సాయంగా అందించామన్నారు. ఏడాదికి ఒక కుటుంబానికి సాయం చేయడమే లక్ష్యంగా సంస్థ పనిచేస్తుందన్నారు. తమను నమ్మి ఆర్థిక సాయం అందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.

కార్యక్రమంలో హోమియోపతి వైద్యుడు శశిధర్‌, స్థానిక ఎలక్ట్రికల్‌ ఏఈ బాలకృష్ణ, మనం ట్రస్టు చైర్మన్‌ రమేష్‌, అనకాపల్లి ఏఎంఏఎల్‌ కళాశాల అధ్యాపకుడు హరిబాబు, 30 మంది సంస్థ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement