ముంచంగిపుట్టులో ఇంధన కష్టాలు | - | Sakshi
Sakshi News home page

ముంచంగిపుట్టులో ఇంధన కష్టాలు

May 31 2026 12:48 AM | Updated on May 31 2026 12:48 AM

ముంచంగిపుట్టు: మండలంలో కొద్ది రోజులుగా తీవ్రమైన పెట్రోల్‌, డీజిల్‌ కొరత ఏర్పడడంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. గత మూడు రోజులుగా పెట్రోల్‌ బంకుల ముందు కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరుతున్నాయి. ఇంధన ట్యాంకర్లు వచ్చిన రెండు రోజుల్లోనే స్టాక్‌ అయిపోయిందని బోర్డులు పెట్టడంపై స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. బంకుల నిర్వాహకులు ఇంధనాన్ని బ్లాక్‌ మార్కెట్‌కు తరలిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపించడంతో నిర్వాహకులు తమకు నచ్చినట్లుగా లీటర్ల కొద్దీ ఇంధనాన్ని అమ్ముకుంటూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.

మూడు బంకులు.. అన్నీ సమస్యలే!

ముంచంగిపుట్టు మండల పరిధిలోని లుంగాపుట్టు, బాపన్నపుట్టు, దసరిపుట్టు వద్ద మూడు పెట్రోల్‌ బంకులు ఉన్నాయి. అయితే, బాపన్నపుట్టు బంకులో గత మూడు రోజులుగా పెట్రోల్‌ లభించడం లేదు.. ఇక డీజిల్‌ సరఫరా నిలిచిపోయి వారం రోజులు దాటిపోయింది. దసరిపుట్టు బంకులో అసలు ఎప్పుడు పెట్రోల్‌, డీజిల్‌ ఉంటుందో, ఎప్పుడు బోర్డులు పెడతారో తెలియని గందరగోళ పరిస్థితి నిత్యం నెలకొంటోంది.

వారపు సంత రోజున చుక్కలు చూశారు!

ప్రస్తుతం లుంగాపుట్టు బంకులో మాత్రమే ఇంధన సరఫరా ఉండడంతో శనివారం వాహనదారులంతా అక్కడికే క్యూ కట్టారు. దీనికి తోడు శనివారం మండల కేంద్రంలో వారపు సంత కావడంతో ఏజెన్సీ ప్రాంతాల నుంచి వచ్చిన వందలాది మంది వాహనదారులు ఒకేసారి ఈ బంకుకు చేరుకున్నారు. ఫలితంగా గంటల తరబడి ఎండలోనే నిరీక్షించాల్సి వచ్చింది. తీవ్ర ఇబ్బందులు పడుతూ ఇంధనం వేయించుకుని వెళ్లారు. ఉన్నతాధికారులు కేవలం కాగితాలకే పరిమితమై.. ఏజెన్సీలో పెట్రోల్‌, డీజిల్‌ కొరత లేదంటూ ప్రకటనలు చేయడం కాదని, క్షేత్రస్థాయిలో బంకుల్లో ఇంధనం నిరంతరం అందుబాటులో ఉండేలా పక్కా చర్యలు తీసుకోవాలని గిరిజన వాహనదారులు, ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

పెట్రోల్‌, డీజిల్‌ కొరతతో

వాహనదారుల ఇబ్బందులు

Advertisement
 
Advertisement
Advertisement