దేవరాపల్లి: భూముల రీ సర్వే పేరిట రైతుల నుంచి డబ్బులు వసూలు చేయడం దారుణమని ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు కె.వి.రమణ విమర్శించారు. దేవరాపల్లిలో శనివారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. పారదర్శకంగా చేపట్టాల్సిన భూముల రీ సర్వేకు కొందరు అధికారులు, అధికారుల పేరు చెప్పి కొందరు నాయకులు ఎకరానికి రూ. 2వేలు నుంచి రూ. 3 వేల వరకు వసూలు చేస్తున్నట్లు పలువురు రైతులు తమ దృష్టికి వచ్చారన్నారు. రీసర్వేను క్షేత్ర స్థాయిలో పారదర్శకంగా చేపట్టకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రీ సర్వే చేపట్టే తేదీ, సమయాన్ని భూ యజమానులు, రైతులకు లిఖిత పూర్వకంగా తెలియజేయాల్సి ఉండగా వాట్సాప్ గ్రూపుల ద్వారా సమాచారం అందించడంతో స్మార్ట్ ఫోన్లు లేని రైతులకు సమాచారం అందడం లేదని తెలిపారు. సమాచారం తెలియక రైతులు హాజరు కాకపోవడంతో సిబ్బంది తూతూ మంత్రంగా రీ సర్వే నిర్వహిస్తున్నారని, దీంతో రైతులకు ప్రయోజనం కంటే కొత్త చిక్కులు వస్తున్నాయన్నారు.కొందరు రెవెన్యూ సిబ్బంది అధికార పార్టీ నాయకులకు అనుకూలంగా సర్వే చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయని చెప్పారు. రీ సర్వే పేరుతో దౌర్జన్యంగా డబ్బులు వసూలు చేస్తే రైతులు తమ దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు. రీ సర్వేలో జరుగుతున్న అవకతవకలపై పక్కా ఆధారాలతో జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి రైతులకు తగు న్యాయం జరిగేలా కృషి చేస్తానని రమణ తెలిపారు.


