చోడవరం: అంబేడ్కర్ ఆశయ సాధనకు అంతా కృషి చేయాలని అంబేడ్కర్ మిషన్ ఇండియా(ఏఐఎం) వ్యవస్థాపక అధ్యక్షుడు, ఐపీఎస్ సునీల్‌కుమార్ తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో మండలంలోని మైచర్లపాలెంలో నూతనంగా నిర్మించిన అంబేడ్కర్ విగ్రహాన్ని శనివారం ఆయన ఆవిష్కరించారు. గ్రామానికి వచ్చిన ఆయనకు అంబేడ్కర్ యూత్ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సునీల్‌కుమార్ మాట్లాడుతూ అన్ని వర్గాలకు అన్ని రంగాల్లో సముచిత స్థానం కల్పించాలన్న ఆశయంతో అంబేడ్కర్ ఎంతో పనిచేశారన్నారు. మంచి క్రమశిక్షణతో యువత ముందడుగు వేస్తూ ఉన్నత ఆశయాలతో అభివృద్ధి చెందుతూ దేశ సేవలో తరించాలని కోరారు. కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షురాలు గాడి కాసు, ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రతినిధి మూర్తా శ్రీనివాసరావు, మైచర్లపాలెం అంబేడ్కర్ యూత్ ప్రతినిధులు పాల్గొన్నారు.


