● వేడుకున్న కంపుమానుపాకల గ్రామస్తులు
గూడెంకొత్తవీధి: మీ కాళ్లు మొక్కుతాం.. మా ఊరికి రోడ్డు బాగు చేయండి మహాప్రభో!.. అంటూ గూడెం పంచాయతీ కంపుమానుపాకల గ్రామస్తులు అధికారులను దీనంగా వేడుకున్నారు. సరైన రహదారి లేక తాము పడుతున్న నరకయాతనను వివరిస్తూ శుక్రవారం వారు రోడ్డుపైనే నిలబడి నిరసన తెలిపారు. తమ సమస్యపై ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోవడంతో గ్రామస్తులంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రహదారి అధ్వానంగా మారడంతో, గ్రామస్తులంతా కలిసి శ్రమదానం ద్వారా రోడ్డుకు ఇరువైపులా పేరుకుపోయిన పిచ్చితుప్పలను తొలగించారు. ప్రస్తుతం ఉన్న మట్టిరోడ్డు వర్షం పడితే చాలు బురదమయంగా మారుతోందని, దీనివల్ల కనీసం నడవడానికి కూడా వీల్లేకుండా పోతోందని వారు వాపోయారు.కంపుమానుపాకల గ్రామం మీదుగానే మరో 20 గ్రామాలకు వెళ్లాల్సి ఉంటుందని, రోడ్డు సరిగా లేకపోవడం వల్ల ఆయా గ్రామాల ప్రజలు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.గుంతలమయమైన ఈ దారిలో ప్రయా ణిస్తూ ఇప్పటికే ఎంతోమంది ప్రమాదాల బారిన పడ్డారని గ్రామస్తులు గుర్తుచేశారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి, తమ గ్రామాలకు శాశ్వత రహదారి సౌకర్యం కల్పించి ఆదుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.


