నిర్మాణ రంగంలో కనీస నిబంధనలు పాటించని భవన యజమానులు.. విధుల్లో కనీస జాగ్రత్తలు తీసుకోని విద్యుత్ శాఖ సిబ్బంది నిర్లక్ష్యం ఇద్దరు నిరుపేద కార్మికుల ప్రాణాలను బలితీసుకుంది. శుక్రవారం చోటుచేసుకున్న రెండు వేర్వేరు విద్యుత్ ప్రమాదాలు రెండు కుటుంబాల్లో తీరని చీకట్లను నింపాయి. ఒక చోట నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనం ఒకరి ప్రాణం తీస్తే.. మరొక చోట లైన్‌మెన్ అజాగ్రత్త ఒక యువకుడిని మృత్యువాత పడేలా చేసింది. ఈ ఘోర ప్రమాదాలతో అటు గోపాలపట్నం, ఇటు ఆనందపురం పరిసర ప్రాంతాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. – గోపాలపట్నం/ఆనందపురం
విద్యుత్ స్తంభం ఎక్కి మరమ్మతులు చేస్తుండగా..
ఆనందపురం మండలంలోని బోని గ్రామ పంచాయతీ పరిధిలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. పొలాల్లో విద్యుత్ సరఫరాలో సమస్య రావడంతో, స్థానిక లైన్‌మెన్ వెనుక కాళ్ల అప్పలరాజు అనే యువ ఎలక్ట్రీషియన్ వెళ్లాడు. సమస్యను పరిష్కరించేందుకు అప్పలరాజు విద్యుత్ స్తంభం ఎక్కి మరమ్మతులు చేస్తుండగా.. ఒక్కసారిగా కరెంట్ సరఫరా కావడంతో తీవ్ర విద్యుదాఘాతానికి గురయ్యాడు. స్తంభం పైనే నిశ్చేష్టంగా పడిపోయిన అప్పలరాజును స్థానికులు వెంటనే పద్మనాభం మండలం రేవిడి పీహెచ్‌సీకి తరలించారు. అతడు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
నాలుగేళ్ల క్రితమే వివాహం
మృతుడు అప్పలరాజు స్వస్థలం భీమిలి మండలం శింగనబంధ కాగా, అత్తవారు ఊరైన బోని గ్రామంలోనే ఉంటూ ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. నాలుగేళ్ల క్రితమే రమ్య అనే యువతితో ఇతనికి వివాహమైంది. చేతికొచ్చిన యువకుడు కళ్లముందే కరెంట్ షాక్‌తో మరణించడంతో భీమిలి, ఆనందపురం మండలాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆనందపురం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కిటికీ అద్దాలు బిగిస్తూ..
జీవీఎంసీ 57వ వార్డు సాకేతపురంలో శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. ఆశవానిపాలెంకు చెందిన బొల్లా దుర్గారావు (30) అనే భవన నిర్మాణ కార్మికుడు ఓ ఇంటి నిర్మాణంలో కిటికీ అద్దాలు బిగిస్తున్నాడు. అయితే, భవనానికి అత్యంత సమీపంలోనే విద్యుత్ తీగలు ఉండటంతో, ఒక్కసారిగా విద్యుత్ షాక్‌కు గురై కిటికీ నుంచి కిందపడిపోయాడు. కేవలం రెండో అంతస్తు పైనుంచే పడిపోయినప్పటికీ, తల రోడ్డుకు బలంగా తగలడంతో దుర్గారావు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
ఆగని రోదనలు.. రూ. 14 లక్షల పరిహారం
దుర్గారావు మరణవార్త విన్న భార్య అశ్విని, మూడేళ్లు, ఏడాది వయసున్న ఇద్దరు చిన్నారులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహంపై పడి రోదించిన తీరు స్థానికులను కన్నీరు పెట్టించింది. భవన యజమాని నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందంటూ బంధువులు, గ్రామస్థులు భవనం వద్దే మృతదేహంతో ఆందోళన చేపట్టారు. చివరకు మధ్యవర్తుల సమక్షంలో బాధిత కుటుంబానికి రూ. 13 లక్షల పరిహారం, దహన సంస్కారాలకు మరో లక్ష రూపాయలు ఇచ్చేందుకు యజమాని అంగీకరించాడు. ఎయిర్‌పోర్ట్ పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు.
టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం
సిల్ట్ ప్లాన్ (జీ ప్లస్ 2) తీసుకున్న భవన యజమాని కనీస సెట్‌బ్యాక్‌లు వదలకుండా, విద్యుత్ లైన్లకు ఆనుకుని భవనాన్ని నిర్మించడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని స్థానికులు మండిపడుతున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్నా టౌన్ ప్లానింగ్ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం వల్లే ఇలాంటి ప్రాణాంతక పరిస్థితులు ఎదురవుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు.
నిర్మాణ స్థలంలో కార్మికుడు.. విద్యుత్ స్తంభంపై ఎలక్ట్రీషియన్ మృతి


