అగనంపూడి: వ్యక్తిని బెది రించి రూ.30 వేలు దోచుకున్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు గాజువాక సౌత్ ఏసీపీ భవ్యారెడ్డి తెలిపారు. దువ్వాడ పోలీస్ స్టేషన్ ఆవరణలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె కేసును సాంకేతిక పరిజ్ఞానంతో త్వరితగతిన ఛేదించామని చెప్పారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండలం జంగం సరియా గ్రామానికి చెందిన కిల్లోల పరశురామ్ ఉపాధి కోసం లంకెలపాలేనికి వచ్చి, స్థానికంగా పనులు చేసుకుంటూ శ్రీరామ్‌నగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. ఈ నెల 22న సాయంత్రం పరశురామ్ చెప్పులు కొనుగోలు చేసేందుకు గాజువాక వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఆలిండియా రేడియో రిసీవింగ్ స్టేషన్ సమీపంలో మరుగుదొడ్డి కోసం తుప్పల్లోకి వెళ్లగా, అక్కడ ఉన్న ముగ్గురు వ్యక్తులు ఆయన చేతులు కట్టేసి ప్యాంటు జేబులో ఉన్న రూ.10 వేలు అపహరించారు. అనంతరం దాడి చేయడంతో పరశురామ్ ప్రతిఘటించలేకపోయాడు. నిందితులు ఆయన సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకుని ఫోన్‌పే ద్వారా మరో రూ.20 వేలను తమ ఖాతాలకు బదిలీ చేసుకున్నారు. వెళ్లేప్పుడు ఆయన చేతికి ఉన్న వెండి కడియాన్ని కూడా లాక్కొని పరారయ్యారు. బాధితుడు జరిగిన విషయాన్ని తన యజమాని మోహన్‌కు తెలియజేయడంతో దువ్వాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పాత నేరస్తుల కదలికలపై నిఘా ఉంచి, సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో గుర్రం మణికంఠ, ఓ జువైనల్, దుర్గాప్రసాద్ ఈ దోపిడీకి పాల్పడినట్లు గుర్తించి కేసు నమోదు చేశారు. నిందితుల నుంచి మొబైల్‌తో పాటు రూ.13,500 స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. జువైనల్‌పై 12 కేసులు, మణికంఠపై ఐదు కేసులు, దుర్గాప్రసాద్‌పై నాలుగు కేసులు వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదై ఉన్నాయని చెప్పారు. కార్యక్రమంలో క్రైమ్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరావు, ఎస్‌ఐ సత్తిబాబు పాల్గొన్నారు.
ముగ్గురు అరెస్ట్


