● చంద్రబాబు మాట.. నీటి మూట
మోదమ్మపై
పాడేరు మోదకొండమ్మ తల్లి సాక్షిగా గిరిజనులకు వంచన జరిగింది. జాతీయ స్థాయి మేడారం జాతరను తలపించేలా సాగే మోదమ్మ ఉత్సవాలకు, ఆలయ అభివృద్ధికి కొండంత అండగా ఉంటామని చెప్పిన కూటమి ప్రభుత్వం.. తీరా ఆచరణలోకి వచ్చేసరికి మొండిచేయి చూపింది. సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం వేదికగా ఇచ్చిన రూ. 2 కోట్ల హామీ, తొమ్మిది నెలలు గడిచినా ‘కాగితం’ దాటలేదు. నిధులు రావు.. అనుమతులు లేవు.. పనులు ఊసే లేదు అన్నట్టుగా తయారైంది ప్రస్తుత పరిస్థితి. గిరిజనుల సెంటిమెంట్‌తో ముడిపడి ఉన్న ఆలయ అభివృద్ధిని కూడా రాజకీయ ప్రచారానికే పరిమితం చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సాక్షి, పాడేరు: ఉత్తరాంధ్ర భక్తుల కల్పవల్లి, గిరిజనుల ఆరాధ్యదైవం పాడేరు మోదకొండమ్మ తల్లి ఆలయ అభివృద్ధి విషయంలో కూటమి ప్రభుత్వం నిలువునా మోసం చేసింది. జాతీయ స్థాయిలో మేడారం సమ్మక్క–సారలమ్మల వలె పేరుగాంచిన ఈ క్షేత్రంపై ముఖ్యమంత్రి చంద్రబాబు వరాల జల్లు కురిపించి, ఆ తరువాత విస్మరించడంపై గిరిజన భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వంజంగి సాక్షిగా వంచన
గత ఏడాది ఆగస్టు 9వ తేదీన పాడేరు మండలం వంజంగిలో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవం వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు భారీ హామీ ఇచ్చారు. మోదకొండమ్మ ఆలయాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని, ఇందుకోసం రూ.2 కోట్లు వెచ్చిస్తామని ఆర్భాటంగా ప్రకటించారు. ఆలయ ప్రాంగణంలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పడంతో, గిరిజన భక్తులు తమ ఆరాధ్య దైవానికి మహర్దశ పడుతుందని భావించారు. టీడీపీ శ్రేణులు సైతం ఈ ప్రకటనపై విస్తృత ప్రచారం కల్పిస్తూ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ హడావుడి చేశారు.
నివేదికలు సిద్ధం.. నిధులు శూన్యం
సీఎం ఆదేశాలతో అప్పట్లో దేవదాయ శాఖ, పాడేరు ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ విభాగం అధికారులు ఆలయ ప్రాంగణంలో సమగ్ర సర్వే నిర్వహించారు. అభివృద్ధి పనులకు సంబంధించి అంచనా నివేదికలను రూపొందించి ఐటీడీఏ ద్వారా ప్రభుత్వానికి సమర్పించారు. గత కలెక్టర్ దినేష్ కుమార్ కూడా ఈ నిధుల విడుదల కోసం పలుమార్లు నివేదికలు పంపారు. అయితే, ప్రకటన వెలువడి తొమ్మిది నెలలు గడుస్తున్నా.. నేటికీ ఒక్క పైసా నిధులు విడుదల కాలేదు. కనీసం పరిపాలన అనుమతులు కూడా మంజూరు కాకపోవడం గమనార్హం.
భక్తుల ఆవేదన
ముఖ్యమంత్రి హోదాలో ఇచ్చిన హామీ కాబట్టి పనులు చకచకా సాగుతాయని ఆశించిన భక్తులకు నిరాశే మిగిలింది. ఒక్క అభివృద్ధి పని కూడా ప్రారంభం కాకపోవడం చూస్తుంటే చంద్రబాబు ప్రకటన కేవలం రాజకీయ స్టంట్‌గానే కనిపిస్తోంది.. అని ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు వాపోతున్నారు. ఆరాధ్య దైవం సాక్షిగా గిరిజనులను మోసం చేయడంపై ఏజెన్సీలో సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది.
పనుల అంచనాలిలా..
చంద్రబాబు ప్రకటన మేరకు గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ విభాగం అధికారులు రూ.2 కోట్ల నిధులకు సంబంధించి అంచనాలు తయారు చేశారు. మోదకొండమ్మతల్లి ఆలయం వెనుక ఉన్న కల్యాణ మండపంపై మరో అంతస్తు భవన నిర్మాణం, ఆలయ అర్చకుల నివాస గృహాలు, అన్నదానం వంటషెడ్లు,భక్తుల భోజనాలకు వసతి, మోదమ్మ ఆలయం ఎదుట ఆడిటోరియం అభివృద్ధి, అమ్మవారి ఆలయానికి చెందిన 40 సెంట్ల స్థలం చుట్టూ ప్రహరీ, గేట్లు ఏర్పాటు, భక్తులకు విశ్రాంతి సౌకర్యాలు కల్పన.
ప్రచారానికే పరిమితం
పాడేరు మోదకొండమ్మతల్లి ఆలయాన్ని రూ.2 కోట్లతో అభివృద్ధి చేస్తామన్న సీఎం చంద్రబాబు ప్రకటన ప్రచారానికి పరిమితమైంది. తొమ్మిది నెలలు కావస్తున్నా ఆలయ అభివృద్ధికి ఇంతవరకు పైసా కూడా ఆయన విడుదల చేయలేదు. ఈ ఏడాది మోదకొండమ్మతల్లి పండగ నాటికి ఆలయ అభివృద్ధి పనులు జరుగుతాయని అందరూ భావించారు. పాడేరు ఐటీడీఏ ద్వారా కూడా సీఎం పనులు చేపట్టలేక పోయారు. ప్రకటనకు కట్టుబడి వెంటనే నిధులు మంజూరు చేసి, పనులు ప్రారంభించాలి.
–మత్స్యరాస విశ్వేశ్వరరాజు, ఎమ్మెల్యే
మోదమ్మ ఆలయ కమిటీ చైర్మన్
ప్రకటనలకు పరిమితమైనపాడేరులో ఆలయ అభివృద్ధి
మంజూరు కాని రూ.2 కోట్ల నిధులు
తొమ్మిది నెలలు గడిచినా అందని
పరిపాలన అనుమతులు
ఆశగా ఎదురుచూసి నిరాశలో మునిగిన పాడేరు మోదమ్మ భక్తులు


