ఈదురుగాలులతో భారీ వర్షం | - | Sakshi
Sakshi News home page

ఈదురుగాలులతో భారీ వర్షం

Apr 22 2026 7:42 AM | Updated on Apr 22 2026 7:42 AM

సాక్షి, పాడేరు: ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు భానుడి భగభగలతో అల్లాడిన ప్రజలకు, ఒక్కసారిగా మారిన వాతావరణం ఉపశమనాన్ని ఇచ్చింది. మంగళవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి పాడేరుతో పాటు అరకులోయ, హుకుంపేట ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గడంతో ప్రజలు చల్లదనంతో సేదదీరారు. అయితే, పాడేరు ప్రాంతంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో ప్రజలు కొంత ఆందోళనకు గురయ్యారు. సుమారు గంటపాటు కురిసిన ఈ వర్షం ధాటికి పాడేరులో జనజీవనం ఎక్కడికక్కడ నిలిచిపోయింది. కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వాన కూడా కురిసింది. అంతకుముందు, మధ్యాహ్నం వరకు జిల్లావ్యాప్తంగా తీవ్రమైన ఎండలు కాశాయి. కొయ్యూరులో అత్యధికంగా 40.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అనంతగిరిలో 36, అరకులోయలో 36.6, జి.మాడుగులలో 36.7, చింతపల్లిలో 34.5, ముంచంగిపుట్టులో 33.5, పెదబయలులో 33.6, హుకుంపేటలో 32.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

చింతపల్లిలో వడగళ్ల వాన

చింతపల్లి: మండలంలో మంగళవారం వడగళ్లతో కూ డిన వర్షం కురిసింది. ఈదురుగాలులు బలంగా వీయడంతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

కొయ్యూరులో ఈదురు గాలుల బీభత్సం

కొయ్యూరు: మండలంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మంగళవారం మధ్యాహ్నం వరకు విపరీతమైన ఎండతో ఉక్కిరిబిక్కిరి అయిన ప్రజలకు, సాయంత్రం కురిసిన భారీ వర్షం ఉపశమనాన్ని ఇచ్చింది. మొదట తేలికపాటి జల్లులతో ప్రారంభమైన వాన, క్రమంగా భారీ వర్షంగా మారింది. దాదాపు అరగంట పాటు ఈదురు గాలులు బలంగా వీయడంతో పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి.కొయ్యూరుతో పాటు రాజేంద్రపాలెం, నడింపాలెం, పెదమాకవరం తదితర గ్రామాల్లో వర్షం కురిసింది.గాలివాన తీవ్రత దృష్ట్యా ముందుజాగ్రత్త చర్యగా అధికారులు విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. పిడుగులు పడే అవకాశం ఉందన్న విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలతో ప్రజలు అప్రమత్తమయ్యారు. గడిచిన వారం రోజులుగా ఎండ తీవ్రతతో అల్లాడిపోతున్న గిరిజన ప్రాంత ప్రజలు, ఈ వర్షంతో ఒక్కసారిగా చల్లబడిన వాతావరణాన్ని చూసి సేదతీరారు.

జి.మాడుగుల: మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం ఈదురుగాలులతో కూడిన కుండపోత వర్షం కురిసింది. అకస్మాత్తుగా కురిసిన ఈ వర్షం వల్ల ప్రజలు, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మండలంలోని సంతబయలు గ్రామంలో మంగళవారం జరిగిన వారపు సంత వర్షం ధాటికి తడిసిముద్దయ్యింది. సంతలోని వస్త్ర దుకాణాలు, నిత్యావసర సరుకులు, ఫ్యాన్సీ దుకాణదారులు ఒక్కసారిగా కురిసిన వర్షంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సరుకులు తడవకుండా కాపాడుకోవడానికి వ్యాపారులు నానా అవస్థలు పడ్డారు. జి.మాడుగుల–వంజరి, తాజంగి జాతీయ రహదారి మార్గంలో ఉన్న మట్టి రోడ్డు వర్షానికి పూర్తిగా బురదమయంగా మారింది. దీనివల్ల ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు రాకపోకలు సాగించడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జారిపడే ప్రమాదం ఉండటంతో వాహనదారులు భయం భయంగా ప్రయాణించారు.

స్తంభించిన జనజీవనం

డుంబ్రిగుడ: మండలంలోని డుంబ్రిగుడ, అరకువారపుసంతలో మంగళవారం భారీ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం కురిసింది. జనజీవనం స్తంభించింది. పాడేరు–అరకు జాతీయ రహదారిలో ఎటువంటి షెల్టర్లు లేకపోవడంతో ద్విచక్ర వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement