ముంచంగిపుట్టు: మండలంలోని పనసపుట్టు పంచాయతీ, కడుతుల గ్రామంలో మంగళవారం పర్యటించిన ఎంపీడీవో ధర్మారావుకు స్థానిక మహిళలు తమ నీటి కష్టాలను ఏకరువు పెట్టారు. ఏళ్ల తరబడి తాగునీటి కోసం పడుతున్న ఇబ్బందులను వివరిస్తూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలోని 110 కుటుంబాలకు చెందిన సుమారు 352 మంది ప్రజలు కేవలం ఒక్క బావిపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఎండాకాలం కావడంతో గ్రావిటీ పైపులు అడుగంటిపోయి నీరు రావడం లేదని వారు ఆవేదన చెందారు.తాగునీటి కోసం ప్రతిరోజూ పడరాని పాట్లు పడుతున్నామని, అపరిశుభ్రమైన నీటిని వాడటం వల్ల తరచూ వ్యాధుల బారిన పడుతున్నామని మహిళలు వాపోయారు.గ్రామంలో కొత్తగా ఏర్పాటు చేసిన నీటి పథకం సైతం లోవోల్టేజీ సమస్య కారణంగా పనిచేయడం లేదని, దీనివల్ల నీటి సరఫరా నిలిచిపోయిందని ఎంపీడీవో దృష్టికి తీసుకెళ్లారు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఇప్పటివరకు ఎటువంటి స్పందన లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల విజ్ఞప్తిపై స్పందించిన ఎంపీడీవో ధర్మారావు మాట్లాడుతూ.. తక్షణమే సంబంధిత అధికారులతో మాట్లాడి, వోల్టేజి సమస్యతో పాటు తాగునీటి ఎద్దడిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.


