బైక్ ఢీకొని వ్యక్తి మృతి
● మరొకరికి తీవ్ర గాయాలు
● నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలింపు
కొయ్యూరు: పెదమాకవరం పంచాయతీ రామరాజుపాలెం వంతెన వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పెదమాకవరం గ్రామానికి చెందిన సాగిన రాంబాబు (55) అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్‌ఐ కిషోర్‌వర్మ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. శరభన్నపాలెంకు చెందిన లోవసాయి, అతని స్నేహితుడు రామరాజుపాలెంకు చెందిన కె.గిరీష్ బైక్‌పై రామరాజుపాలెం వైపు శుక్రవారం రాత్రి వస్తున్నారు. పెదమాకవరం గ్రామానికి చెందిన సాగిన రాంబాబు, మరొకరు రామరాజుపాలెం వైపు నడుచుకుని వస్తున్నారు. వంతెనపైకి రాగానే ఎదురుగా వస్తున్న లోవసాయి, గిరీష్ బైక్ రాంబాబును బలంగా ఢీకొంది. దీంతో అతని తలకు తీవ్ర గాయమైంది. సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. ఈ ఘటనలో లోవసాయి తీవ్రంగా గాయపడ్డాడు. అతనిని చికిత్స నిమిత్తం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాంబాబు మృతదేహానికి నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. మృతుడు రాంబాబుకు భార్య, కుమార్తె ఉన్నారు.
ఐదుగురికి తీవ్ర గాయాలు
సీలేరు: అంతర్రాష్ట్ర రహదారిలో ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీకొన్న ఘటనలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక వైద్యాధికారి నారాయణరావు తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. గూడెంకొత్తవీధి మండలం పనసలబొంది గ్రామానికి చెందిన కుర్ర
రమేష్, భార్య కుర్ర బుల్లెమ్మ, కుమార్తె గెమిలి సరిత బైక్‌పై వలసగెడ్డ గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్లారు. తిరిగి శనివారం స్వగ్రామానికి బయలుదేరారు. అదే సమయంలో దుప్పులవాడ పంచాయతీ గదభగూడ గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు బైక్‌పై సీలేరు బయలుదేరారు. ఇక్కడికి సమీపంలోని ఐస్‌గెడ్డ మలువు వద్దకు వచ్చేసరికి రెండు బైక్‌లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక పీహెచ్‌సీ సిబ్బంది సంఘటన స్థలానికి వెళ్లి, క్షతగాత్రులను ఆస్పత్రికి తీసుకువచ్చి వైద్యం అందించారు. తీవ్రంగా గాయపడిన వారిలో అర్జున్ అనే వ్యక్తిని మెరుగైన వైద్యం కోసం చింతూరు ఏరియా ఆస్పత్రికి తరలించినట్టు వైద్యాధికారి తెలిపారు.
బైక్ ఢీకొని వ్యక్తి మృతి


