గిరిజన మహిళ మృతదేహంతరలింపులో జాప్యంపై విచారణ చేపట్టాలి
మహారాణిపేట (విశాఖ): అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండలానికి చెందిన గిరిజన మహిళ మృతదేహం తరలింపులో జరిగిన జాప్యంపై పూర్తిస్థాయి విచారణ జరపాలని ఎమ్మెల్సీ డాక్టర్ కుంభా రవిబాబు డిమాండ్ చేశారు. ఆమె మరణించిన తరువాత మృతదేహాన్ని అప్పగించేందుకు 36 గంటల సమయం ఎందుకు తీసుకున్నారో వివరణ ఇవ్వడమే కాకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. శనివారం కేజీహెచ్ సూపరింటెండెంట్ చాంబర్‌లో సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వాణి, సీఎస్‌ఆర్‌ఎంతో డాక్టర్ శ్రీధర్, ఆర్.ఎం.వో డాక్టర్ బంగారయ్య, ఇతర వైద్యులతో ఆయన చర్చించారు. ఈ సందర్భంగా రవిబాబు మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి సంఘటనలపై కూటమి ప్రభుత్వం సీరియస్‌గా స్పందించి చర్యలు చేపట్టాలని, గిరిజనుల పట్ల చిన్నచూపు ప్రదర్శించడం తగదన్నారు. మృతదేహం తరలింపులో అటు గిరిజన సెల్, ఇటు వైద్యులు, పోలీసుల మధ్య సమన్వయం లోపించిందని విమర్శించారు. దీనివల్ల గిరిజనులు కేజీహెచ్‌లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. ఈ నెల 15న కె. రత్నకుమారి అనే మహిళ మృతి చెందగా, మరుసటి రోజు వరకు పోస్టుమార్టం నిర్వహించకపోవడం అన్యాయమని ఆవేదన వ్య క్తం చేశారు. ఈ అంశాన్ని రాబోయే శాసనమండలి సమావేశాల దృష్టికి తీసుకువెళ్తానని స్పష్టం చేశారు.
కలెక్టర్లతో ఎమ్మెల్సీ చర్చలు
మృతదేహం తరలింపులో జాప్యంపై ఎమ్మెల్సీ కుంభా రవిబాబు విశాఖ, అల్లూరి సీతారామరాజు జిల్లాల కలెక్టర్లతో ఫోన్లో మాట్లాడారు. కేజీహెచ్ యంత్రాంగం, పాడేరు గిరిజన సంక్షేమ శాఖ, ఐటీడీఏ పీవో, పోలీసు అధికారుల మధ్య సమన్వయ లోపం వల్లే 36 గంటల పాటు జాప్యం జరిగిందని ఆయన వివరించారు. దీనిపై విచారణ జరిపి బాధ్యులను శిక్షించాలని కోరారు. గిరిజనుల కోసం ప్రత్యేకంగా అంబులెన్సులు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఉన్న అంబులెన్సులు అందుబాటులో లేనందున ఇలాంటి సమస్యలు వస్తున్నాయని, అదనంగా మరో రెండు అంబులెన్సులు కేటాయించాలని ఐటీడీఏ పీవోను కోరగా, ఆమె సానుకూలంగా స్పందించారని రవిబాబు తెలిపారు.
ఎస్టీ సెల్ సందర్శన
కేజీహెచ్‌లోని ఎస్టీ సెల్‌ను శనివారం ఎమ్మెల్సీ డాక్టర్ కుంభా రవిబాబు సందర్శించారు. సిబ్బంది, వైద్యుల వివరాలను ఇన్‌చార్జి డాక్టర్ సంపత్ నుంచి తెలుసుకున్నారు. ఇతర సమస్యలు ఏమైనా ఉంటే తాను అల్లూరి కలెక్టర్, ఐటీడీఏ పీవోలతో మాట్లాడి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఎమ్మెల్సీ కుంభా రవిబాబు డిమాండ్
గిరిజన మహిళ మృతదేహంతరలింపులో జాప్యంపై విచారణ చేపట్టాలి


