విద్యార్థుల మరణాలు ప్రభుత్వ హత్యలే..
● గిరిజన సంఘం జిల్లా మాజీ అధ్యక్షుడు బొండా సన్నిబాబు విమర్శ
● పూజిత కుటుంబానికి రూ.20 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్
పెదబయలు: జిల్లాల్లో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల మరణాలు ప్రభుత్వ హత్యలేనని గిరిజన సంఘం జిల్లా మాజీ అధ్యక్షులు బొండా సన్నిబాబు ఆరోపించారు. శనివారం మండలంలోని సీకరి పంచాయతీ కౌరుపల్లి గ్రామానికి చెందిన కొర్ర పూజిత కుటుంబాన్ని పరామర్శించారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో మాట్లాడారు. మృతికి కారణాలను తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. గిరిజన విద్యార్థులకు సరైన పౌష్టికాహారం అందించడంలో పాఠశాల యాజమాన్యాల నిర్లక్ష్యం కారణంగా చిన్నారులు మృత్యువాత పడుతున్నారని ఆరోపించారు. పూజితకు పాఠశాలలో ఉన్నప్పటి నుంచి ఆరోగ్యం బాగోలేదని, ఈ విషయాన్ని ఈ నెల 6వ తేదీన పాఠశాల ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పారన్నారు. పెదబయలు పీహెచ్‌సీ, ముంచంగిపుట్టు ఏరియా ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించిన నార్మల్‌గా ఉందని చెప్పి మందులు ఇచ్చి పంపించారే తప్ప సరైన వైద్యం అందించడంలో నిర్లక్ష్యం చేశారన్నారు. అందువల్లే విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి విషమించి మృతి చెందిందన్నారు. ప్రాణపాయ స్థితిలో ఉన్న విద్యార్థిని పూజితను ఆస్పత్రికి తరలించేందుకు రెండు గంటలు నిరీక్షించినా 108 సిబ్బంది రాకపోవడం దారుణమన్నారు. ఇదే నెల 6 తేదీన తురకలవలస గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న వంతాల నందిని(13) రక్తహీనతతో మృతి చెందిందని ఆయన ఉదహరించారు. వారం రోజుల వ్యవధిలో మరో విద్యార్థి మృతి చెండడం బాధాకరమన్నారు. విద్యార్థిని పూజిత కుటుంబానికి రూ.20 లక్షల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అన్ని గిరిజన సంక్షేమ పాఠశాలల్లో హెల్త్ వలంటీర్లను నియమించాలని డిమాండ్ చేశారు. గిరిజన సంఘం మండల కార్యదర్శి బొండా గంగాధర పాల్గొన్నారు.


