
పాఠశాల సమస్యల పరిష్కారానికి కృషి
సమస్యలపై ఉపాధ్యాయులతో మాట్లాడుతున్న జెడ్పీ చైర్‌పర్సన్ సుభద్ర
విద్యార్థినులతో మాట్లాడుతున్న జెడ్పీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర
ముంచంగిపుట్టు: దశలవారీగా లబ్బూరు ఏకలవ్య పాఠశాల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామని ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర అన్నారు. మండలంలోని జోలాపుట్టు పంచాయతీ లబ్బూరు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలను బుధవారం జెడ్పీ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర సందర్శించి, వసతులను పరిశీలించారు.నూతన భవనాల పరిస్థితులు ,సౌకర్యాలపై ప్రిన్సిపాల్ సుమన్, ఉపాధ్యాయులతో మాట్లాడి అడిగి తెలుసుకున్నారు. తాగునీరు, విద్యుత్, ఫర్నీచర్ తదితర సమస్యలను సిబ్బంది తెలియజేశారు. అనంతరం తరగతి గదులను పరిశీలించి, నెలకొన్న సమస్యలపై విద్యార్థులతో మాట్లాడారు. పాఠశాల సమస్యలపై ఆందోళన చేయాలని, మాపై ఒత్తిడి తెస్తున్నారని కొంతమంది విద్యార్థులు జెడ్పీ చైర్‌పర్సన్‌కు తెలిపారు. నూతనంగా నిర్మించిన పాఠశాలలో కొన్ని సమస్యలున్నాయని, కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఎందరో భూదాతల సహకారంతో ఏకలవ్య పాఠశాలను లబ్బూరులో ఏర్పాటు చేశామన్నారు. త్వరలో పూర్తిస్థాయి వసతుల కల్పన కోసం చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థులను రెచ్చగొట్టి సమస్యలను సృష్టిస్తూ ఆందోళనకు ప్రోత్సహిస్తే సహించేది లేదని, అటువంటి వారిపై చర్యలు తీసుకుంటామని జెడ్పీ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర హెచ్చరించారు. ఏకలవ్య పాఠశాల ప్రారంభంలో స్థానిక సర్పంచ్, ఎంపీటీసీ, ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వకపోవడంపై చైర్‌పర్సన్ పాఠశాల ఉపాధ్యాయులపై మండిపడ్డారు. తీరు మార్చుకోవాలని సూచించారు. ఎంపీడీవో సూర్యనారాయణమూర్తి, సర్పంచులు నీలకంఠం, గంగాధర్, ఎంపీటీసీ సభ్యులు కమల, భాగ్యవతి, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు పద్మారావు, వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ జగబంధు, నాయకులు మూర్తి, తిరుపతి, పరుశురాం, సన్యాసిరావు, దేవా, నీలకంఠం తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులను రెచ్చగొట్టి సమస్యలు
సృష్టిస్తే సహించం
ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్ పర్సన్
జల్లిపల్లి సుభద్ర..
లబ్బూరు ఏకలవ్య పాఠశాల తనిఖీ, సమస్యలపై ఆరా

పాఠశాల సమస్యల పరిష్కారానికి కృషి