
కూతురితో కలిసి తల్లి ఆత్మహత్య
● భర్తతో ఘర్షణ అనంతరం క్షణికావేశంలో అఘాయిత్యం ● పెట్రోల్ పోసి తొలుత కూతురికి, తర్వాత తనకు నిప్పంటించుకున్న మహిళ
కొయ్యూరు: భర్తతో జరిగిన వివాదంతో క్షణికావేశంలో నాలుగేళ్ల కూతురితోపాటు ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద సంఘటన ఆదివారం రావణాపల్లిలో చోటు చేసుకుంది. మృతురాలు మౌనిక తండ్రి దిబ్బ రాజుబాబు ఫిర్యాదు మేరకు, ఎస్‌ఐ కిషోర్ వర్మ తెలిపిన వివరాలు. రావణాపల్లికి చెందిన సతీష్, రాజేంద్రపాలేనికి చెందిన లువ్వా మౌనిక(29) ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సతీష్ ఆటో డ్రైవర్. మౌనిక టిఫిన్ సెంటర్ నిర్వహించడంతో పాటు పెట్రోల్ అమ్ముతోంది.
కొంత కాలంగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. మద్యానికి బానిసైన సతీష్ తరచూ తాగి వస్తుండడంతో భార్యా భర్తల మధ్య గొడవలు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం మళ్లీ గొడవ జరిగింది. అనంతరం సతీష్ బయటకు వెళ్లాడు. భర్త తీరుతో విసిగిపోయిన మౌనిక ఆత్మహత్య చేసుకుని చనిపోవాలనుకుంది. విక్రయించేందుకు ఇంట్లో సిద్ధంగా ఉన్న పెట్రోల్ సీసాలు పట్టుకుని, కూతురు లాస్యశ్రీతో కలిసి పక్కనే ఉన్న జీడితోటల మధ్యకు వెళ్లింది. మొదట కూతురు లాస్య(4)పై పెట్రోల్ పోసి, ఆ తర్వాత తనపై పోసుకుని నిప్పటించుకుంది. కూతురు అక్కడే చనిపోగా, మౌనిక మంటల వేడిని భరించలేక పక్కన ఉన్న కాలువలో దూకింది. సమాచారం తెలుసుకున్న స్థానికులు వెంటనే ఆమెను వైద్యం కోసం నర్సీపట్నం తీసుకెళ్లారు. అక్కడి నుంచి కేజీహెచ్‌కు తరలించారు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ ఆదివారం అర్ధరాత్రి మరణించింది. స్థానిక కిషోర్ వర్మ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

కూతురితో కలిసి తల్లి ఆత్మహత్య