ఆదిలాబాద్: ఈ నెల 26న నిర్వహించనున్న రాజ్యాంగ దినోత్సవ వేడుకలకు హాజరుకావాలని మాల, మహార్, నేతకానీ అనుబంధ కులాల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు ఎంపీ గోడం నగేశ్‌ను ఆహ్వానించారు. మంగళవారం ఆయనను క్యాంపు కార్యాలయంలో కలిసి ఆహ్వానపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వేడుకల పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ.. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు, అవకాశాలు కల్పించిందని పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలను ప్రతీ జిల్లాలో నిర్వహించి ప్రజల్లో రాజ్యాంగంపై అవగాహన, చైతన్యం పెంచాలని సూచించారు. జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా అధ్యక్షుడు కొప్పుల రమేశ్, ప్రధాన కార్యదర్శి ప్రజ్ఞకుమార్, కోశాధికారి భీంరావు గజ్భరే, మేకల మల్లన్న, భీంరావు వాగ్మారె, పాశం రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.


