సాక్షి, ఆదిలాబాద్: రాష్ట్రంలో వరుస యాత్రలు నిర్వహిస్తున్న భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం జిల్లాలో రైతు యాత్ర నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేస్తోంది. హైదరాబాద్, కరీంనగర్‌లో సర్ ప్రక్రియలో భాగంగా ఓట్ల తొలగింపు విషయంలో కాంగ్రెస్ ఆరోపణలను తిప్పికొట్టేలా మహా పాదయాత్రలు సాగాయి. మరోవైపు నషా ముక్త్ భారత్ పేరిట రాష్ట్ర రాజధానిలో పార్టీ యాత్ర ప్రారంభిస్తోంది. వివిధ జిల్లాల్లో యాత్రలు నిర్వహించడం ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని పార్టీ హైకమాండ్ ఆదేశాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఆయా జిల్లాల్లో వివిధ అంశాల ఆధారంగా యాత్రలు నిర్వహించాలని ప్రణాళిక చేస్తుండగా, జిల్లాలో రైతు యాత్ర చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
అధికారమే లక్ష్యంగా ముందుకు..
వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు పార్టీ అధిష్టానం తీవ్రస్థాయిలో కసరత్తు మొదలెట్టిందని కమలం పార్టీ నాయకులు అభిప్రాయ పడుతున్నారు. రాష్ట్రంలో వరుస యా త్రలు తలపెడుతుండగా, జిల్లాలో రైతు యాత్ర నిర్వహించడం ద్వారా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న విధానాలతో జరిగిన నష్టంపై ఆరోపణలు సంధించేలా యాత్ర చేయాలని పార్టీ ముఖ్య నేతలు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు జిల్లా నేతలు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో నిర్వహించనున్న బీజేపీ రైతు యాత్రపై ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.
డిసెంబర్‌లో ప్రకటించే ఛాన్స్
జిల్లాలో రైతు యాత్రకు సంబంధించి డిసెంబర్ 3, 4 తేదీల్లో పార్టీ అధిష్టానం ఓ తేదీ ప్రకటించే అవకాశముందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. అదే నెలలో ఈ యాత్ర ఉంటుందని చెబుతున్నారు. కాగా, బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఇటీవలే జిల్లా కేంద్రంలో ‘రైతు గర్జన’ నిర్వహించిన విషయం తెలిసిందే. బీజేపీ కూడా ఇదే అంశంపై యాత్ర చేపట్టేలా ప్రణాళిక రూపొందిస్తుండటం ఆ సక్తి కలిగిస్తోంది. హైదరాబాద్, కరీంనగర్‌లో మహా పాదయాత్రలు భారీ సక్సెస్ అయ్యాయని పార్టీ వ ర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. ఇదే ఉత్సాహంతో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో నిర్వహించే యాత్రలను కూడా భారీగా నిర్వహించాలని అధిష్టా నం ప్రణాళిక చేస్తున్నట్లు నాయకులు పేర్కొంటున్నారు. ఆదిలాబాద్ రైతు యాత్రను పెద్ద ఎత్తున ని ర్వహించడం ద్వారా రైతుల్ని ఆకర్షించేందుకు ప్ర యత్నిస్తున్నారు. హైదరాబాద్‌లో అమిత్‌షా, కరీంనగర్‌లో పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ పా ల్గొనగా, ఆదిలాబాద్ రైతు యాత్రలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఇన్‌చార్జి సునిల్ బన్సాల్‌ను ఆహ్వానించాలని యోచిస్తున్నారు.
పార్టీ నేతలను
సమాయత్తం చేయాలని..
ఆదిలాబాద్ పార్లమెంట్‌తో పాటు అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ ప్రజాప్రతినిధులు గోడం నగేశ్, పాయల్ శంకర్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ పార్టీ ప్రభంజనం కొనసాగించేందుకు అధిష్టానం తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా వివిధ కార్యక్రమాల రూపకల్పన చేస్తున్నారు. ఇందులో భాగంగా రైతు యాత్ర ఆదిలాబాద్‌లో నిర్వహించబోతుండగా, దీన్ని విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణుల్ని ఇప్పటినుంచే సమాయత్తం చేయాలని ముఖ్య నేతలు యోచిస్తున్నారు. అందుకు అనుగుణంగా ప్రణాళిక రూపొందిస్తున్నారు.


