బోథ్: సోయాబీన్, మొక్కజొన్న పంటలకు మార్కెట్‌లో డిమాండ్ అమాంతం పెరగడంతో కొనుగోళ్లలో వ్యాపారుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. వారు మార్కెట్ యార్డుల వద్ద వేచి చూడకుండా నేరుగా రైతుల కల్లాల వద్దకే పరుగులు తీస్తున్నారు. రవాణా ఖర్చులు తగ్గుతాయని, తక్షణమే నగదు చేతికి అందుతుందనే ఆశతో రైతులు వారికే పంటను విక్రయించేందుకు మొగ్గు చూపుతున్నారు. అయితే, కొందరు వ్యాపారులు నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. తెలంగాణ వ్యవసాయ ఉత్పత్తులు, పశువుల మార్కెట్ల చట్టం–1966 ప్రకారం నోటిఫైడ్ మార్కెట్ ప్రాంతంలో రైతుల వద్ద నేరుగా పంటలు కొనుగోలు చేయాలంటే వ్యాపారులకు తప్పనిసరిగా మార్కెటింగ్ శాఖ జారీ చేసే డైరెక్ట్ పర్చేసింగ్ లైసెన్స్ లేదా చెల్లుబాటయ్యే ట్రేడింగ్ లైసెన్స్ ఉండాలి. కొందరైతే ఇవి లేకుండానే గ్రామాల్లో యథేచ్ఛగా కొనుగోళ్లు చేస్తున్నారు. కొనుగోలు వివరాలేలు మార్కెట్ రికార్డుల్లోకి నమోదు కాకుండా జాగ్రత్త పడుతూ సెస్ ఎగవేస్తున్నారు. కొనుగోలు చేసిన పంటలను రహస్యంగా గోదాములు, ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.
లైసెన్స్ ఉన్నవారిదీ ఇదే తీరు..
లైసెన్స్ కలిగిన వ్యాపారులు కొనుగోలు చేసిన పంటను తక్కువగా చూపిస్తూ మార్కెట్ యార్డులకు సెస్ చెల్లించడంలేదు. దొంగ లెక్కలతో యార్డులను బురిడీ కొట్టిస్తున్నారు. నిబంధనల ప్రకారం కొనుగోలుదారులే ఒక్క శాతం విలువ ఆధారిత మార్కెట్ ఫీజు యాక్డుకు చెల్లించాల్సి ఉంటుంది. లైసెన్స్ ఉన్న వ్యాపారులు ప్రతినెలా తాము కొనుగోలు చేసిన పంట వివరాలతో కూడిన నెలవారీ రిటర్న్‌లను అందించి, ఆ మేరకు సెస్ చెల్లించాలి. కానీ, కొందరు వ్యాపారులు రైతుల నుంచి పెద్ద మొత్తంలో సోయా, మొక్కజొన్న పంటలను కొనుగోలు చేసి, అందులో నామమాత్రపు పరిమాణాన్ని మాత్రమే తమ ఖాతా పుస్తకాలు, రికార్డుల్లో నమోదు చేస్తున్నారు. మిగతా సరుకును బిల్లులు లేకుండానే (జీరో దందా) తరలిస్తూ తక్కువ పంటకే సెస్ చెల్లిస్తున్నారు. దీంతో మార్కెట్ యార్డుల ఆదాయానికి భారీగా గండి పడుతోంది.
ఆదాయం కోల్పోతున్న యార్డులు
జిల్లాలో ఆదిలాబాద్, బోథ్, ఇంద్రవెల్లి, ఇచ్చోడ, జైనథ్‌లో మార్కెట్ యార్డులున్నాయి. మార్కెట్ సెస్ ద్వారా వచ్చే ఆదాయంతోనే ఈ యార్డుల్లో మౌలిక సదుపాయాలు, గోదాములు, తాగునీరు, రైతు విశ్రాంతి భవనాలు, గ్రామీణ లింక్ రోడ్ల నిర్మాణం వంటి అభివృద్ధి పనులు చేపడతారు. వ్యాపారుల సెస్ ఎగవేతతో కమిటీలు ఆర్థికంగా బలహీనపడే ప్రమాదం ఏర్పడింది. అంతేకాకుండా, లైసెన్స్ లేని వ్యాపారులకు రైతులు పంటను విక్రయిస్తుండగా తూకాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. నగదు చెల్లింపుల్లోనూ జాప్యం చేస్తున్నారు. కొందరైతే ఎగ్గొడుతున్నట్లు ఆరోపణలున్నాయి. అధికారిక తూకం చీటీలు, రసీదులు లేకపోవడంతో మార్కెట్ కమిటీలూ జోక్యం చేసుకోలేకపోతున్నాయి. గ్రామాల్లో జరుగుతున్న అనధికారిక కొనుగోళ్లపై మార్కెటింగ్ శాఖ, విజిలెన్స్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరముందని, లైసెన్స్ లేకుండా కొనుగోలు చేసే వ్యాపారుల వాహనాలను సీజ్ చేసి కఠినచర్యలు తీసుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు.


