కై లాస్‌నగర్: ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఆన్‌మ్యాపింగ్, అనామలీస్ ఓటర్లందరికీ నిర్ణీత గడువులోపు నోటీసులు జారీ చేసి, హియరింగ్స్ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సి.సుదర్శన్‌రెడ్డి ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి జిల్లా ఎన్నికల అధికారులతో సర్ ప్రక్రియ పురోగతిపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఫారం–6, 7,8 దరఖాస్తుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలన్నారు. నోటీసుల జారీతో పాటు వాటిపై తదుపరి చర్యలు చేపట్టి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. డ్రాఫ్ట్ ఓటరు జాబితాపై వచ్చిన అభ్యంతరాలను సైతం ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలన్నారు. ప్రతి బీఎల్‌వోకు నిర్దిష్ట లక్ష్యాలను కేటాయించి, వారి పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. కలెక్టర్ రాజర్షిషా మాట్లాడుతూ జిల్లాలోని కొన్ని మారుమూల గ్రామాల్లో నెట్‌వర్క్ సమస్య కారణంగా ఆన్‌లైన్‌లో త్వరగా ప్రాసెస్ చేయలేకపోతున్నామన్నారు. ఈమేరకు ఆఫ్‌లైన్‌లో డేటా ఎంట్రీకి ప్రత్యేక ఆప్షన్ కల్పించాలని సీఈవోను కోరారు. ఈ వీసీలో అదనపు కలెక్టర్ ఆర్‌ఎస్.చిత్రు, జిల్లా రెవెన్యూ అధికారి స్రవంతి, ఆర్డీవో జగదీశ్వర్‌రావు, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు నలంద ప్రియా, నాయబ్ తహసీల్దార్ మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.


