మంచిర్యాలఅర్బన్: రాఖీ పండుగ సందర్భంగా ప్ర యాణికుల రద్దీ దృష్ట్యా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపిస్తోంది. ఈ నెల 25నుంచి మూడు రోజులపాటు రాకపోకలకు ఏర్పాట్లు చేసింది. రద్దీకి అనుగుణంగా ప్రధాన రూట్లతోపాటు హైదరాబాద్ నుంచి వివి ధ ప్రాంతాలకు ప్రత్యేక బస్సులకు ప్రణాళిక సిద్ధం చేసింది. మహాలక్ష్మి పథకం అమలులో ఉండడంతో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. సాధారణ బస్సులతోపాటు రద్దీని తట్టుకోవడానికి ఆది లాబాద్ రీజియన్‌లో ప్రత్యేక బస్సులు అందుబాటులోకి తెస్తున్నారు. హైదరాబాద్‌లో చదువులు, వివిఽ ద ఉద్యోగ, వ్యాపార నిమిత్తం ఉన్నవారంతా స్వగ్రామాలకు రానుండడంతో ఈ నెల 25,26, 27న 157 ప్రత్యేక బస్సుల్లో గమ్యస్థానాలకు చేర్చనున్నారు.
ముందుస్తు రిజర్వేషన్లు
టికెట్ ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం ఉండడంతో ప్రధాన మార్గాల్లో బస్సులన్నీ ఫుల్ అయ్యాయి. హైదరాబాద్ వయా లక్సెట్టిపేట మీదుగా ఈ నెల 27, 28న మంచిర్యాలకు వచ్చే పది బస్సులు నిండిపోయాయి. మధ్యాహ్నం మూడు గంటల నుంచి అర్ధరాత్రి వరకు రాకపోకలు సాగించే బస్సుల్లో మరింతగా డిమాండ్ ఉంది. మరో తొమ్మిది ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.
ప్రత్యేక బస్సుల్లో అదనపు చార్జీలు
సాధారణ సర్వీసుల్లో రెగ్యులర్ చార్జీలే ఉంటాయి. మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం యథావిధిగా వర్తిస్తుంది. పండుగ సమయంలో నడిపే ప్రత్యేక బస్సుల్లో ఒకటిన్నర చార్జీలు(50శాతం అదనం) వసూలు చేయనున్నారు. పండుగ వేళ పేద, మధ్య తరగతి కుటుంబాలపై అదనపు చార్జీల భారం పడనుంది.


