పంచాయతీ కార్యదర్శి చేతివాటం | - | Sakshi
Sakshi News home page

పంచాయతీ కార్యదర్శి చేతివాటం

Jul 25 2026 2:05 AM | Updated on Jul 25 2026 2:05 AM

కొత్తపట్నం:

మండల కేంద్రమైన కొత్తపట్నం పంచాయతీలో నిధులు గల్లంతయ్యాయి. అవి ఏమయ్యాయో తేల్చలేక అధికారులు తికమకపడుతున్నారు. పంచాయతీరాజ్‌ అధికారులున్నా వాటిపై దృష్టి సారించలేదు. ఒకరిపై మరొకరు చెప్పుకుని ప్రజల సొమ్ము కాజేస్తున్నారు. ఆడిట్‌ అధికారుల తూతూమంత్రంగా వచ్చి ఆడిట్‌ చేసి వెళ్తున్నారు. వాస్తవాలు తెల్సినా బాధ్యులపై చర్యలు తీసుకోవడం లేదు. జిల్లా అధికారులు వచ్చి వెళ్తున్నారు తప్ప ఒక్క అడుగు కూడా ముందుకు వేయడం లేదు. కొత్తపట్నం మాజీ ఉప సర్పంచ్‌ పురిణి గోపి పీజీఆర్‌ఎస్‌లో అర్జీ పెట్టారు. గోపి వద్ద ఆన్‌లైన్‌ బిల్లులు స్పష్టంగా ఉన్నా అధికారులు కాలయాపన చేస్తున్నారు. గోపి ఇచ్చిన అర్జీ మేరకు కలెక్టర్‌ ఆదేశాలతో శుక్రవారం కొత్తపట్నం పంచాయతీ కార్యాలయంలో రికార్డులు తనిఖీ చేసేందుకు డివిజనల్‌ పంచాయతీ అధికారి ఆర్‌.పద్మ వచ్చారు. గోపిని పిలిపించి అన్ని రికార్డులు, బిల్లులు, వోచర్లు తనిఖీ చేశారు.

కార్యదర్శిపై ఆరోపణలు...

ఈ సందర్భంగా మాజీ ఉప సర్పంచి గోపి మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శి సంపత్‌కుమార్‌ సుమారు రూ.5 లక్షలు స్వాహా చేశాడని, ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. గ్రామ పంచాయతీకి కేటాయించిన అసిస్మెంట్‌, తీర్మానాలు లేకుండా అసిస్మెంట్‌ నంబర్లు ఇవ్వటం, ఒకరు అసిస్మెంట్‌ నంబర్‌ మరోకరు ఇవ్వటం, రికార్డును తారుమారు చేయటంతో బాధితులు ఇబ్బందులు పడుతున్నారని ఆమె దృష్టికి గోపి తీసుకెళ్లారు. ఇంటి పన్నుల బిల్లు పుస్తకాలు 9 ఉండగా మూడు పుస్తకాలు లేకుండా చేశారని, మిగిలిన ఆరు పుస్తకాల్లో ఒక పుస్తకంలో నగదు రూ.92 వేలు జమ కాలేదని ఆమెకు వివరించారు. ప్రజలు చెల్లించిన ఇంటి పన్నుల రసీదుల పుస్తకాలు బయటపెడితే అసలైన వాస్తవాలు తెలుస్తాయని గోపి కోరారు. పంచాయతీ కార్మికులకు ఎనిమిది నెలలుగా జీతాలు ఇవ్వలేదని, కొన్ని కాంట్రాక్ట్‌ పనులు చేశామని, వాటి బిల్లులు కూడా రాలేదని ఆమెకు వివరించారు. సర్పంచ్‌ సంతకాలు లేకుండా సంపత్‌కుమార్‌ డ్రా చేసిన బిల్లులు రికార్డులతో సహా ఆమెకు చూపించారు. పద్మ మాట్లాడుతూ ప్రస్తుతం కొన్ని రికార్డులు మాత్రమే పరిశీలించానని, మరో రోజు వచ్చి రికార్డులు పూర్తిగా పరిశీలించి సంపత్‌కుమార్‌కు నోటీసులు పంపిస్తామని చెప్పారు. అసరమైతే తనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీపీఓ స్పష్టం చేశారు. డిప్యూటీ ఎంపీడీవో వేణుగోపాల్‌మూర్తి, కొత్తపట్నం పంచాయతీ అభివృద్ధి అధికారి శ్రీనివాసరావు, బిల్‌ కలెక్టర్‌ సునీత పాల్గొన్నారు.

పీజీఆర్‌ఎస్‌లో ఇచ్చిన అర్జీకి

స్పందించిన డీపీఓ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement