ఒంగోలు టౌన్: విద్యార్థులకు చదువుతో పాటు ఆరోగ్యం కూడా ముఖ్యమని, తల్లిదండ్రులు తమ పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని డాక్టర్ చాపల వంశీకృష్ణ సూచించారు. శుక్రవారం నగరంలోని సత్యనారాయణపురంలో మండల పరిషత్ ప్రాథమిక మోడల్ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. ప్రీ హెల్త్ స్క్రీనింగ్ కార్డులను విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ... ఆరోగ్యకరమైన పిల్లలే భవిష్యత్తు భారతదేశాన్ని ముందుకు నడిపించగలరని చెప్పారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా ఉత్సాహం చూపాలన్నారు. క్రీడలు క్రమశిక్షణ అలవరుస్తాయని, గెలుపోటములను సమానంగా స్వీకరించే వ్యక్తితాన్ని ఇస్తాయని చెప్పారు. భవిష్యత్తులో కూడా విద్యార్థులకు శ్రీరాం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ద్వారా సేవా కార్యక్రమాలు కొనసాగించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ శాంతకుమారి, సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ సరోజినీదేవి, చిన్నపిల్లల వైద్య నిపుణులు గంగా సాగర్‌రెడ్డి, రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ కొప్పోలు సౌమిత్ర పల్లవ్, మాజీ కార్పొరేటర్ గురవయ్య, పాఠశాల హెచ్‌ఎం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.


