ఒంగోలు టౌన్: విజయవాడలోని మణిపాల్ ఆస్పత్రిలో చిన్న పిల్లల గుండె జబ్బులకు ఆధునిక పద్ధతిలో శస్త్ర చికిత్సలు చేస్తున్నట్లు కన్సల్టెంట్ సీటీవీఎస్ డాక్టర్ దిలీప్ రట్టీ తెలిపారు. ఇందుకోసం విజయవాడ, ఒంగోలులో ప్రత్యేక పీడియాట్రిక్ కార్డియాలజీ, కార్డియోథొరాసిక్, వాస్కులర్ సర్జరీ క్లినిక్‌ను ప్రారంభించినట్లు వెల్లడించారు. శుక్రవారం ఒంగోలు నగరంలోని అద్దంకి బస్టాండులో గల కేబీ రెస్టారెంటులో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ దిలీప్ మాట్లాడుతూ... పుట్టుకతో వచ్చే గుండె జబ్బులు పిల్లల్లో పెరుగుతున్న దశలో గుండె జబ్బులతో బాధపడుతున్న చిన్నారులకు సమగ్ర వైద్య సేవలందిస్తున్నట్లు వివరించారు. ప్రత్యేక టీం ఆధ్వర్యంలో ఇప్పటి వరకు మణిపాల్ హాస్పిటల్‌లో 3 వేల మంది చిన్నారులకు గుండె శస్త్ర చికిత్సలను విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా తాళ్లూరు మండలం వెలుగవారిపాలెం గ్రామానికి చెందిన మూలి సుబ్బమ్మ, రమణారెడ్డి దంపతుల ఆరేళ్ల కుమార్తెకు గుండె జబ్బుకు సంబందించిన ఆరుదైన శస్త్ర చికిత్స చేసినట్లు చెప్పారు. అలాగే సింగరాయకొండ మండలం కరేడు పల్లెపాలెం గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలికకు శస్త్ర చికిత్స చేసినట్లు తెలిపారు. ఆ కుటుంబాలను మీడియాకు పరిచయం చేశారు. విలేకరుల సమావేశంలో సీనియర్ కన్సల్టెంట్, ఇంటర్వెన్షనల్ పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ డాక్టర్ కె.విక్రమ్, హాస్పిటల్ డైరెక్టర్ సీఏజే రామాంజనేయరెడ్డి, తాళ్లూరుకు చెందిన బాలిక తల్లి ఎం.సుబ్బమ్మ, కరేడు పల్లెపాలేనికి చెందిన బాలిక మేనమామ వాసు తదితరులు పాల్గొన్నారు.


